కాగజ్‌నగర్, ఏప్రిల్ 16: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనపై బుధవారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ తీశారు. ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి కుల వివక్ష కారణంగానే ఆత్యహత్యకు పాల్పడిందని, ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన లైంగిక దాడుల ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ అయి అనేక మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఆయన వెంట మహిళలు, కార్యకర్తలు ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
కాగజ్‌నగర్ మండలం కడంబాకు చెందిన దాదాపు 20 మంది యువకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. నక్క మురళి ఆధ్వర్యంలో వారు బీఆర్ఎస్లోకి రాగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగూరే శ్యాంరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో ఆర్ఎస్పీ పర్యటన
చింతలమానేపల్లి, ఏప్రిల్ 16 : మండలంలోని బాబాపూర్, జూజులగూడ, కోర్సిని, గంగాపూర్ గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్ పర్యటించారు. ఆయాచోట్ల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అటవీ శాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చేలల్లోకి వెళ్లనివ్వడం లేదని, రోడ్లు, బోర్లు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ సర్కారులో రంది లేకుంటా పంటలు సాగు చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లనుంచి వ్యవసాయం చేసుకుంటున్నా రైతులను అడ్డుకోవడం ఏమిటని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోమాసి లహాంచు, నాయకులు శివకుమార్, పోషన్న, శంకర్, జాన్సీ ఉన్నారు.