కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): అటవీ భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారనో..అడవిలోని చెట్లను నరుకుతున్నారనో కలప రవాణా చేస్తున్నారనో.. ఇలా ఏదో ఒకరకంగా ఆదివాసీలపై అటవీ అధికారులు నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లింగాపూర్ మండలం లెండిగూడాకు చెందిన ఆదివాసీ ఇళ్లలో తనిఖీ చేసి ఇంటి తలుపులు వాడిన కలప అక్రమమని బెదిరించి అటవీ అధికారులు తమ వద్ద రూ.30 వేలు వసూలు చేశారని ఆదివాసీలు డీఎఫ్‌వోకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లింగాపూర్ మండలం లెండిగూడ గ్రామానికి చెందిన మడావి రాము, మరప సాగర్ పదేళ్లకు ముందే నిర్మించిన ఇండ్లల్లో ఉంటున్నారు.
ఈ నెల 4న ఆ ప్రాంతంలో అటవీ శాఖ ఎఫ్ఎస్వో రాందాస్, ఎఫ్‌బీవో వనిత వారి ఇళ్లలో కలప ఉందని తనిఖీలు చేశారు. అయితే కలప దొరకకపోయేసరికి వారి ఇంటికి ఉన్న తలుపులను చూసి ఇవి పాతవి కాదని, కొత్తగా ఏర్పాటు చేశారని, అందుకు వాడిన కలపను అటవీ నుంచి అక్రమంగా తీసుకువచ్చారని, జరిమానా విధించి కేసులు పెడుతామని బెదిరించారని ఆదివాసులు తెలిపారు. రూ.30 వేలు ఇస్తే కేసులు లేకుండా వదిలేస్తామని చెప్పడంతో చేసేదేమీలేక ఎద్దులను అమ్మి అటవీ అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ఆదివాసీ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కనక యాదవ్రావ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా డీఎఫ్‌వో అందుబాటులో లేకపోవడంతో అటవీ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌కు ఆదివాసులు ఫిర్యాదు చేశారు. జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో ఆదివాసీలపై ఆరోపణలు చేస్తూ జీవనాధారమైన భూములకు ఆక్రమించుకునేందుకు, ఏదో ఒక సాకు కేసులు పెట్టేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎఫ్ఎస్వో రాందాస్‌ను వివరణ కోరగా ఏ తనిఖీలు చేయలేదని, డబ్బులు తీసుకోలేదని తెలిపారు.
మా గ్రామంలో అటవీ అధికారులు నా ఇంటితోపాటు మపర సాగర్ ఇంటిలో కలప ఉందని తనిఖీలు చేశారు. కలప దొరకకపోయే సరికి మా ఇండ్లకు ఉన్న పాత తలుపులపై కేసు నమోదు చేస్తామని బెదిరించారు. రూ.30 వేలు ఇస్తే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తామని అన్నారు. దీంతో మేము భయపడిపోయాం. మాకు ఉన్న ఎడ్లని అమ్మి అటవీ అధికారులకు రూ.30 వేలు కట్టినం. ఇప్పటికే పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని కేసులు పెడుతున్నరు. కేసుల భయంతోనే డబ్బులు కట్టినం.
– మడావి రాము, లెండిగూడా, లింగాపూర్ మండలం
మా ఇళ్లలో చొరబడి మా ఇండ్లకు ఉన్న పాత తలుపులను కొత్తవిగా చూపించి మాపై కేసులు పెడుతామని బెదిరించి మా వద్ద రూ.30 వేలు తీసుకున్న ఎఫ్ఎస్వో రాందాస్, ఎఫ్‌బీవో అనితపై చర్యలు తీసుకోవాలి. మా డబ్బులు ఇప్పించాలి. వ్యవసాయ పనులను అడ్డుకొని అటవీ అధికారులు అక్రమంగా కేసులు పెడుతారమోనని భయపడి మా ఎడ్లను అమ్మి వారికి డబ్బులు కట్టినం. ఇటు ఎడ్లు లేక, చేతిలో డబ్బులు పోయి ఇబ్బందులు పడుతున్నం.
– మపర సాగర్, లెండిగూడా, లింగాపూర్ మండలం