ఎదులాపురం, మే 6 : కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రిమ్స్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. ఇటీవల వివిధ విభాగాల్లో వైద్యులు నియామకమైన సందర్భంగా సోమవారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మహ్మద్ ఇద్రీస్ అక్బనీతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. క్యాన్సర్, మోకాలి కీళ్ల మార్పిడి, కిడ్నిస్టోన్ వంటి వాటికి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే గుండె వ్యాధులకు కూడా ఆపరేషన్లు ప్రారంభిస్తామని వివరించారు. ప్రస్తుతం న్యూరో, ప్లాస్టిక్ సర్జరీతోపాటు మూత్రపిండాల నిపుణులు అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. జిల్లావాసులు రిమ్స్, సూపర్ స్పెషాలిటీలో అందిస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ కల్యాణ్రెడ్డి, ఆర్ఎంవో చంపత్రావు, పీడియాట్రిక్ సర్జన్ దేవీదాస్, సర్జికల్ అంకాలజిస్ట్ జక్కుల శ్రీకాంత్, న్యూరాలజిస్ట్ విజయ్ మోహన్, వైద్యులు రాజేశ్ జాదవ్, మధులికలు తదితరులు ఉన్నారు.