భైంసా, మే 19 : ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టి పైసల్లేవన్నవ్. కానీ.. ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పైసలెక్కడివని మాజీ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ విమల గాదేవార్ అన్నారు.
సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోటీలకు వచ్చిన అమ్మాయిలకు ఒక్కొక్కరికి 30 తులాలు ఇచ్చేందుకు రూ.200ల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కాలంలో పెండ్లి చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం వెంటనే ఇవ్వాలన్నారు. అంతేగాకుండా ప్రపంచ సుందరీమణుల కాళ్లు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందాల పోటీల పేరిట ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని మంట గలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.