తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandoor ) మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన పేద రైతులు( Farmers ) సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ( Land Pattas ) ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం పోడు రైతులతో కలిసి తహసీల్దార్ జ్యోత్స్న కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, పోడు భూముల రైతులు మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు రకాల చట్టాలను తీసుకొస్తున్నా కిందిస్థాయిలో పేద రైతులకు న్యాయం జరగడం లేదని, పోడు భూముల విషయంలో పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భరత్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా సీనియర్ నాయకులు రామగౌని మహీధర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, దుర్గ చరణ్, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, బూత్ అధ్యక్షుడు అరికెల శంకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.