మందమర్రి(రూరల్) : మండలంలోని గ్రామాలలో గుడుంబా (Gudumba) , మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని వెంటనే అరికట్టాలని బీజేపీ నాయకులు వంజరి వెంకటేష్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
వెంకటాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా అమ్మకాలు అధికమయ్యాయని , అనేక మంది గుడుంబాకు బానిస కావడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబా సేవించి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబ పెద్దదిక్కు కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయని, పిల్లల పోషణ తల్లికి భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం గుడుంబా తయారీదారుల మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడం, గుడుంబా వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో గుడుంబా అమ్మకాలు నిలిచిపోయాయని అన్నారు. కొంతమంది ముఠాగా ఏర్పడి గుడుంబాను గ్రామాలకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గుడుంబా తయారు చేసే గ్రామాలకు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.