ఆసిఫాబాద్ అంబేదర్చౌక్/ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 13: కుమ్ర భీం ఆసిఫాబాద్ కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ సమీపంలో ప్రభుత్వ స్థలంలోని నాలాను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో లోకేశ్వరరావు మాట్లాడుతూ బీడీపీపీ, అసైన్డ్, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నాలా కబ్జాపై ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించి తొలగించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు.
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నాలాలపై నిర్మాణాలు చేపట్టినా, ప్రభుత్వ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని ఆర్టీవో లోకేశ్వరరావు హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఇరిగేషన్ డీఈ దామోదర్, సీఐ రవీందర్, ఎస్ఐ రాజేశ్వర్ సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.