మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ) : “నేను రైతు బిడ్డనే.. వడగండ్ల వాన రైతన్నను కోలుకోకుండా చేసింది. మీ బాధలు స్వయంగా చూడాలని వచ్చా. చూశా.. మీతో మాట్లాడా.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తాం.. అధికారులు సర్వే చేయండని ఆదేశిస్తున్నా..” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన పంట నష్టపరిహారం ప్రకటన చేశారు. తాజాగా పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకున్నాడని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడుతుండగానే.. మరోవైపు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తూ పెద్దదిక్కుగా నిలుస్తున్నాడని కొనియాడుతున్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్ మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు చేతికొస్తున్న పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలతో వరి, జొన్న, పత్తి చేలు నేలకొరిగాయి. ఉమ్మడి జిల్లాలో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాణిజ్య, ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. రైతుల కష్టం చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పంట నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. స్వయంగా రైతులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధం గా నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4,480 మంది రైతులకు చెందిన 5,082 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు గుర్తించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మధ్యే ఎకరాకు రూ.10 వేల చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.5.08 కోట్ల పరిహారం విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇచ్చి.. నష్టపోయిన పంటకు పరిహారం అందిస్తున్న సీఎం కేసీఆర్ రైతులందరికీ పెద్దదిక్కుగా నిలిచారంటున్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న సర్కారుకు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
రుణపడి ఉంటాం..
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సారు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. నాకున్న ఐదెకరాల్లో వరి వేశా. పంట చేతికొచ్చే సమయంలోనే వడగండ్ల వాన రావడంతో మొత్తం పాడైపోయింది. కోయక ముందే పైరు నేలవాలింది. పెట్టుబడి నష్టపోయా. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిహారం ఇవ్వడం సంతోషంగా ఉంది. రైతులకు కష్టం కలుగకుండా ప్రభుత్వం ఆదుకుంటోంది.
– మిర్జా ఖలీల్ బేగ్, ఎల్లూర్, పెంచికల్పేట
దేవోనోలే సాయం జేసిండు..
ఎల్లూరు శివారులో నాకున్న ఐదెకరాల జాగలో వరేసిన. ఏప్రిల్ నెల్ల పడ్డ చెడగొట్టు ఆనకు పంటంత పాడైంది. కొద్దామనుకోంగనే వర్షం పంటను నాశనం జేసింది. ఆన చినుకులు రాళ్లలెక్క పడడంతో అడ్లన్నీ రాలిపోయినయ్. ఒక్క వడ్లిత్తు గూడా చేతికిరాలె. నాలెక్కనే సానా మందియి గూడ కరాబైనయ్. ఎట్లని బాధపడ్డం. సీఎం కేసీఆర్ సారు పంట నష్టపోయినోళ్లకు పైసలిస్తనని జెప్పిండు. ఎకరాకు పదేలు ఇస్తనన్నడు. సానా సంతోషమనిపించింది. గిప్పుడు డబ్బులస్తున్నయ్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ సారు. దేవునోలే సాయం జేసిండు.
– చెన్న బోయిన చిన్నన్న, ఎల్లూరు, పెంచికల్పేట.