తెలంగాణ ఏర్పడే నాటికి తీవ్రమైన విద్యుత్ సంక్షోభం.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీకు చీకట్లే మిగులుతయ్ అని సాక్షాత్తూ అప్పటి సీఎం శాపనార్థాలు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు విపరీతమైన కరంటు కోతలు. వ్యవసాయానికి పేరుకే ఆరు గంటల విద్యుత్. కానీ.. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోయేదో తెలియని దుస్థితి. ఏ అర్ధరాత్రో కరంట్ వచ్చిందని పొలానికి నీరు పెట్టడానికి వెళ్తే పాములు, తేల్లు కుట్టడంతో ప్రాణాలు పోయేవి. చీకట్లో నడుచుకుంటూ వెళ్తే విద్యుత్ వైర్లు తాకి ప్రాణాలు పోయేవి. స్వరాష్ట్రంలో కర్షకులకు కరంటు కష్టాలు ఉండొద్దనే కృతనిశ్చయంతో సీఎం కేసీఆర్ ఎవుసానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నడు. 2018 జనవరి 1వ తేదీన పురుడుపోసుకున్న ఈ పథకం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘నమస్తే’ అందిస్తున్న కథనం.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 2018 కంటే ముందు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 33,701 ఉండగా.. ప్రస్తుతం 44,599కి పెరిగాయి. సబ్స్టేషన్లు కూడా 32 ఉండగా 53కు.. ట్రాన్స్ఫార్మర్లు 11,398 ఉండగా.. ప్రస్తుతం 14,570కి పెరిగాయి. విద్యుత్ వినియోగంలో వ్యవసాయానిది మెజార్జీ వాటా 30 శాతం వ్యవసాయ కనెక్షన్లదే ఉంటుంది. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతమైంది. క్షేత్రస్థాయిలో కొత్తగా కేవీ సబ్స్టేషన్లు, ఈహెచ్‌టీ లైన్లు ఏర్పాటు చేశారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో సాగుకు విద్యుత్ డిమాండ్ అధికం. ముఖ్యంగా నవంబర్ నుంచి మార్చి వరకు నాలుగు నెలల్లో వినియోగం పెరుగుతుందని అధికారులు అంటున్నారు. అక్టోబర్‌లో విద్యుత్ వినియోగంలో వ్యవసాయ కనెక్షన్ల వాటా 10 శాతం ఉంటే, నవంబర్‌లో ఒక్కసారిగా 30 శాతానికి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి వరకు డిమాండ్ ఈ తరహాలోనే ఉండనుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 6,174 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎస్టీ 390, ఎస్సీ 675, బీసీ, ఓసీ 5,109 ఉన్నాయి. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా కంటే ముందు నెలకు 0.65 మిలియన్ యూనిట్లు వినియోగం అయ్యేది. యేడాదికేడాదికి వినియోగం పెరుగుతుండగా.. ప్రస్తుతం ఐదేండ్లుగా సర్కారు ఉచితంగా కరంటు అందిస్తున్నది. ప్రస్తుతం నెలకు సుమారుగా 0.75 మిలియన్ యూనిట్లను రైతులు వినియోగిస్తున్నారు. నిరంతర విద్యుత్ నేపథ్యంలో ఆరు కొత్త 33/11 ఉప విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం కావాల్సిన వసతులు సర్కారు కల్పించడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా అవుతున్నది.
బిల్లు కట్టే బాధ తప్పింది
రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం మొదలుపెట్టిన ప్పటి నుంచి బిల్లు కట్టే బాధ తప్పింది. ఇగ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండ చేసిన్రు. కరెంటు బిల్లు మస్తు వస్తుందని ఇది వరకు పత్తి మాత్రమే వేసేటోళ్లం. అంత చేసినా అప్పుడు రూ.1800 నుంచి రూ.2000 బిల్లు వచ్చేది. ఇప్పుడు వరి వేస్తున్నాం. అయినా బిల్లు కట్టుడు లేకుంటైంది. ఓ దిక్కు రైతుబంధు ఇస్తూనే, ఉచిత కరెంటు కూడా ఇస్తున్నరు. ఇగ రైతులకు ఇంతకంటే ఏం కావాలి. రైతులకు అండగా నిలవడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు.
– గొళ్ల రామయ్య, ఇటికాల, లక్షెట్టిపేట
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో 25,378 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో కరెంటు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడేవారు. నాలుగైదు గంటలు త్రీఫేజ్ కరంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు రాదో? తెలిసేది కాదు. లో వోల్టేజీ సమస్య కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. దీంతో రైతులు చేతికి వచ్చిన పంటలను నష్టపోయేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదేళ్లుగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తుండగా.. వానకాలం, యాసంగికి అవసరమై సమయంలో నీటిని అందిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 3,22,209 ఉండగా, ఇందులో 66,460 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. నిరంతర కరంటు సరఫరా కంటే ముందు సాగు విస్తీర్ణం కేవలం 80 వేల ఎకరాలు మాత్రమే ఉండగా.. 2.15 లక్షల ఎకరాలకు పెరిగింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.56 కోట్లు వెచ్చించి 35 సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అవసరమైన చోట కొత్త లైన్లు వేశారు. నాణ్యమైన కరెంటు సరఫరా కోసం 210 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు వేయగా.. 11కేవీ లైన్లు 141 కిలోమీటర్లు వేశారు. కాగా నిరంతర సరఫరాకు ముందు యేడాదికి 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవగా.. ప్రస్తుతం 780 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ప్రస్తుతం రోజుకు 0.79 మిలియన్ యూనిట్లు ఖర్చవుతుండగా, వేసవిలో ఈ వినియోగం మరో 20 శాతం వరకు పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. నిర్మల్ జిల్లాలోనే యేటా నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.468 కోట్లు ఖర్చు భరిస్తున్నది.
రాత్రిపూట గోస పడేటోళ్లు..
నాకు ఆదిలాబాద్ శివారులో రెండెకరాల భూమి ఉంది. బావి, మోటర్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఐదారు గంటల కరంటు వచ్చేది. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇచ్చేటోళ్లు, దీంతో కరంటు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసేటోళ్లం. రాత్రిపూట పంటలకు నీళ్లు పెట్టడానికి గోస పడాల్సి వచ్చేది. అటవీ జంతువులు, పాముల భయం ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కరంటు కష్టాలు తీరాయి. 24 గంటలు కరంటు బాగా ఇస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన కరంటోళ్లు బాగు చేస్తున్నారు. ఉచితంగా ఇస్తున్న కరంటుతో వానకాలం పత్తి, కంది.. యాసంగిలో కూరగాయలు పండిస్తున్నా.
– రాజు, రైతు, ఆదిలాబాద్ జిల్లా.
కేసీఆర్ బాధలన్నీ పోగొట్టిండు
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఇది వరకు వానకాలం పంట మాత్రమే వేసేటోళ్లం. సీఎం కేసీఆర్ 24 గంటలు ఉచితంగా కరంట్ ఇస్తున్నప్పటి నుంచి యాసంగిలో కూడా సాగు చేస్తున్నం. బోర్ల నిండ పుష్కలంగా నీళ్లున్నయ్. ఎప్పుడంటే అప్పుడు పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నం. తెలంగాణ రాకముందు ఎవుసం గురించి పట్టించుకున్నోళ్లు లేరు. కరెంట్ ఉంటే.. నీళ్లు..నీళ్లుంటే.. కరెంట్ ఉండక పోయేది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల బాధలన్నీ పోగొట్టిండు. ఆయన ఉన్నంత కాలం మాకు ఢోకా లేదు.
– జాటోత్ శంకర్, బర్రెపెల్లి, దహెగాం మండలం
ఉచిత కరంటుతో రెండు పంటలు..
నాకు నాలుగెకరాల భూమి ఉంది. వానకాలంలో పత్తి, సోయా సాగు చేస్తా. యాసంగిలో శనగ, జొన్న వేస్తా. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు సక్రమంగా ఉండకపోవడంతో వర్షాలపై ఆధారపడి వానకాలం పంట సాగు చేసేటోన్ని. ఆ పంటకు కూడా నీళ్లు అవసరమైనప్పటికీ కరంటు ఉండక పోవడంతో దిగుబడులు సరిగా వచ్చేవి కావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కరంటు సమస్యలు సీఎం కేసీఆర్ దూరం చేసిండు. ఐదేళ్ల నుంచి 24 గంటలు ఉచితంగా ఇస్తున్నడు. దీంతో యాసంగి పంటలకు నీళ్లకు ఢోకా లేకుండా పోయింది. నాకు వ్యవసాయ బోర్ ఉంది. అవసరమైనప్పడు మోటర్ చాలు చేసి నీటిని అందిస్తున్నా. యాసంగి పంటల ఖర్చులు అన్ని పోనూ రూ.60 వేల నుంచి రూ.70 వేలు మిగులుతాయి. కేసీఆర్ సర్ ఇస్తున్న కరంటు వల్ల ఈ ఆదాయం వస్తున్నది.
– లాకే అశోక్, రైతు, ముక్రా(కే), ఇచ్చోడ మండలం.
బతుకులు మారినయ్..
మునుపు కరెంట్ సరిగా ఉండేది కాదు. ఒక్క వానకాలంలో మాత్రమే పంట వేసేటోళ్లం. బాయిలనిండా నీళ్లున్నా కరెంట్ ఉండకపోయేది. యేటా ఒక్క పంట మాత్రమే తీసేటోళ్లం. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు మారినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం మస్తు మంచి పనులు చేస్తున్నడు. ఉచితంగా కరెంట్ ఇస్తున్నడు. రైతు బంధు కింద పెట్టుబడికి ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఇయ్యవట్టే. మాకు 3 ఎకరాల భూమి ఉంది. కౌలు మరో నాలుగు ఎకరాలు తీసుకున్న. రంది లేకుండా ఎవుసం చేసుకొని బతుకుతున్నం.
– ఎల్కరి సత్యన్న, దహెగాం
రెండు పంటలకు ఢోకా లేదు..
సీఎం కేసీఆర్ సారు ఐదేండ్లుగా ఎవుసానికి 24 గంటల కరంటు అందిస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరంగా ఉచితంగానే ఇస్తున్నాడు. ఎన్ని కట్టాలు ఎదురైనా.. కోట్లు ఖర్చయినా వెనక్కి తగ్గడం లేదు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ కావల్సినవన్ని అందిస్తున్నాడు. నాకు మా ఊరిలో 20 ఎకరాల భూముంది. నాలుగు బోరు బావులున్నాయి. పూర్తిగా బోరు నీటితోనే పండిస్తున్నా. గతంల సక్రమంగా కరంటు లేనప్పుడు వానకాలంల పదెకరాలు, యాసంగిలో ఐదెకరాలు నీరందుతుండే. నీరు బాగున్నప్పటికీ కరంటు కోతలతో నీటిని వాడుకునేది లేకుండే. రాత్రి పూట మూడు గంటలు, దినంల నాలుగు గంటలు మాత్రమే ఉంటుండే. ఒక మూల పారితే.. ఇంకో మూల ఎండుతుండే. గతంలో కరెంటు కోతలతో చాలా ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసు. అందుకే రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గిప్పుడు కరంటు నిరంతరంగా ఉండడంతో అందరూ సంతోషంగా ఉంటున్నరు.
– మహేందర్ రెడ్డి, రైతు, సిద్దిలకుంట, సోన్ మండలం.
24 గంటల కరెంటుతో కూరగాయల సాగు.
నాకు పదిహేనెకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు చేసేందుకు మూడు బోరు బావులున్నాయి. ఐదేళ్లుగా కరంటు సమస్య లేకపోగా, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందుతుండడంతో సంప్రదాయ పంటలతోపాటు కూరగాయలు పండిస్తున్నా. ప్రతి యేడాది వానకాలంలో ఏడెకరాల్లో పసుపు, ఒక ఎకరంలో వరి, మిగతా భూమిలో మక్క, ఎర్రజొన్న, ముళ్ల జొన్న పండిస్తున్నా. వేసవిలో పండించే కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీంతో యేటా ఫిబ్రవరి మొదటి వారంలో టమాట, మిరప, వంకాయ సాగు చేస్తా. మండు వేసవిలో కూరగాయలు పండించి అమ్ముకోవడం ద్వారా అధిక లాభాలు వస్తున్నాయి. బోర్లలో నీరు ఉన్నప్పటికీ గతంలో కరెంటు లేక పంటలు పండేవి కావు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. నిరంతర కరెంటుతో రెండు పంటలు పండడమే కాకుండా దిగబడులు కూడా అధికంగా వస్తున్నాయి. రైతుల కోసం సీఎం కేసీఆర్ అన్నీ మంచి చేస్తున్నడు.
– నర్సారెడ్డి, రైతు, కౌట్ల, నిర్మల్ రూరల్ మండలం.