మంచిర్యాల టౌన్ : మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై ( Development ) చర్చకు తాను సిద్ధమని , సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు (Former MLA Diwakar Rao) సవాల్ విసిరారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధితోపాటు, అవినీతి అక్రమాలు, రౌడీయిజం, అక్రమ కేసుల, పైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవినీతి, అబద్ధాలు అంటేనే ఎమ్మెల్యే పీఎస్ఆర్ అని ఆరోపించారు. మంచిర్యాల అంతర్గాం వంతెన విషయంలో ఎమ్మెల్యే రోజుకో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
వైకుంఠధామం నిర్మాణానికి నాలుగున్నర కోట్లు మంజూరు కాగా 12 కోట్లతో నిర్మిస్తామని మాయమాటలు చెపుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కూలుస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లలో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అందుకు సంబంధించిన వివరాలను దివాకర్‌రావు వెల్లడించారు .