కోటపల్లి, ఫిబ్రవరి 29 : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వెంచపల్లి గ్రామ సమీపంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోగల ఫెర్రి పాయింట్స్, పోలీస్స్టేషన్స్ను గురువారం సందర్శించారు. సీపీ మాట్లాడుతూ జన జీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలనుకునేవారికి ప్రభుత్వం తరపున వచ్చే లాభాలన్నీ అందేలా చూస్తామన్నారు. అజ్ఙాతంలో ఉండి సాధించేదేదీ లేదని, లొంగిపోతే పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అభివృద్ధికి ఆటంకంగా నిలిచేవారిని నిలువరించేందుకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్ ద్వారా పహారా కాస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంచపల్లి వద్ద పడవలు నడుపుకునేవారు, చేపలు పట్టేవారితో మాట్లాడిన సీపీ సరిహద్దుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకెన్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, చెన్నూర్ సీఐ రవీందర్, కోటపల్లి, నీల్వాయి ఎస్ఐలు మహేందర్, సుబ్బారావు పాల్గొన్నారు
వేమనపల్లి, ఫిబ్రవరి 29 : సంఘ విద్రోహ శక్తులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం నీల్వాయి పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ సుధీర్రాంనాథ్కేకన్తో కలిసి సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలన్నారు. నీల్వాయిలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్, నీల్వాయి, కోటపల్లి ఎస్ఐలు సుబ్బారావు, రవీందర్ ఉన్నారు.