మంచిర్యాల టౌన్, జూన్ 3 : బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ ఫ్రధాన కార్యదర్శి గడప రాకేశ్‌పై దాడి ముమ్మాటికీ కాంగ్రెస్ గూండాల పనేనని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాకేశ్‌ను సోమవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి పరామర్శించారు. ఆయనకు తగిలిన గాయాలను పరిశీలించారు. అతి కిరాతకంగా బేస్‌బాల్ బ్యాట్లు, రాడ్లతో దాడి చేశారని, వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ మాట్లాడుతూ రాకేశ్‌ను పథకం ప్రకారమే కొట్టారన్నారు.
అతడిని చంపేందుకు కాంగ్రెస్ గూండాలు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని స్పష్టం అవుతోందని, పీఎస్సార్ ఇంటి ముందే ఈ దాడి జరిగిందన్నారు. ఇక్కడ ప్రజాపాలన జరుగడం లేదని, ప్రతీకార పాలన జరుగుతుందని చెప్పారు. ఐదునెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి సొంతజిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను హత్యచేశారని, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
మంచిర్యాలలో హత్యారాజకీయాలు సాగుతున్నాయని, ఇది సరైన పద్ధతికాదని హితవుపలికారు. ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ నాయకులు మంచి పాలన అందించాలని, ఇలాంటి ప్రతీకార దాడులు చేయడం, హత్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఎంతో అభివృద్ధి చేశామని, ఇలాంటి హత్యారాజకీయాలు ఏనాడూ చేయలేదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్‌ను కలుస్తామని చెప్పారు. సరైన న్యాయం జరుగకపోతే మేం రోడ్డు మీదకు వస్తామని, అప్పుడు ఏమైనా జరిగితే అందుకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ దాడులకు భయపడేది లేదని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ ప్రత్యేకంగా లీగల్ టీంలను ఏర్పాటు చేసుకుందని, ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే లీగల్ టీం ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి సంస్కృతి సరైంది కాదని, రాకేశ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు.
బీఆర్ఎస్ నాయకుడు గడప రాకేశ్‌పై హత్యాయత్నం జరుగడం ముమ్మాటికీ ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు పనేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యే పీఎస్సార్ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఎన్నికలకు ముందు పీఎస్సార్ నిర్వహించిన ప్రెస్మీట్లలో రాకేశ్ సంగతి చూస్తానని చెప్పడం ఇం దుకు నిదర్శనమన్నారు.
ఎమ్మెలేగా గెలిచినప్పటి నుంచి మంచిర్యాలలో గొడవలు జరుగుతున్నాయని, ప్రశాంతంగా ఉండే మంచిర్యాలలో అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు. ఇదిచిన్న సంఘటన అని కొట్టి పారేస్తున్నారని, 15 మంది గూండాలు కలిసి ఒక్క మనిషిపై రాడ్ లు, కర్రలతో అతి దారుణంగా కొట్టి చంపాలని చూడటాన్ని చిన్న ఘటనగా చెప్పడం దారుణమన్నారు. గూండాలు జరిపిన దాడిలో శరీరం కమిలిపోయిందని, ఆ దెబ్బలు మీకే తగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నారని, ఇలా దాడులు చేస్తే ప్రజలు తిరగబడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజిత్‌రావు, గాదెసత్యం, అంకం నరేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుడు గడప రాకేశ్‌పై జరిగిన దాడితో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పీఎస్సార్‌కు ఎలాంటి సంబంధం లేదని నాయకులు స్ప ష్టం చేశారు. సోమవారం మంచిర్యాలలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేశ్ మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పీఎస్సార్‌కు అంటగట్టాలని చూడడం సరికాదన్నారు. రాకేశ్‌పై దాడిని తాము కూడా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.
మంచిర్యాల ఏసీసీ, జూన్ 3 : గడప రాకేశ్‌పై దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఈశ్వర్, పెద్దపల్లి జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధుకర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకుడు విజిత్కుమార్తో కలిసి బుధవారం సాయం త్రం సీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. బాధితునికి న్యాయం చేయాలని కోరారు.