ఆదిలాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.194 కోట్లతో 33 కిలోమీటర్ల నిర్మాణంలో భాగంగా రెండు వరుసల రహదారితోపాటు తర్నం వంతెన నిర్మాణం కొనసాగుతున్నది. ఈ వంతెన నిర్మాణంతోపాటు కల్వర్టులు ఏడు మీటర్లు ఉన్న రహదారిని పది మీటర్ల విస్తరణ వంటి పనులు చేపడుతున్నారు. 2024 మే నెలలో ప్రారంభమైన పనులు 2026 మేలో పూర్తి కావాల్సి ఉండగా జాప్యం జరుగుతున్నది. ఈ రహదారి మీదుగా భోరజ్, జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రహదారి విస్తరణ పనులు, తర్నం వంతెన నిర్మాణ పనులు కారణంగా రాకపోకలకు అంతరాయం కలగడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలకు నిలయంగా తర్నం బ్రిడ్జి
తర్వం వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్నది. రెండేళ్ల కిందట పనులు ప్రారంభం కాగా పిల్లర్లు వేసి స్లాబ్ వేయాల్సి ఉండగా.. ఇప్పటికే కేవలం పిల్లర్లు మాత్రమే వేశారు. ఈ ఏడాది వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసి ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాల్సిన నేషనల్ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఎన్‌హెచ్ కార్యాలయం ఆదిలాబాద్‌లో కాకుండా నిర్మల్‌లో ఉండడంతో అధికారులు అప్పుడప్పుడూ వస్తుంటారని స్థానికులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి జైనథ్, భోరజ్, బేల మండలాల రైతులు వ్యవసాయ పనులు, పంటల విక్రయాలు స్థానికులు తమ రోజువారి అవసరాలు వైద్యం, విద్య, ఇతర పనుల కోసం ఈ రహదారి మీదుగా ప్రయాణం చేస్తుంటారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా నేషనల్ హైవే అధికారులు రూ.4.50 కోట్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఈ వంతెనను తక్కువ ఎత్తులో పైపులు వేసి నిర్మించారు. దీంతో చిన్నపాటి వర్షానికి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా రవాణాకు ఆటంకం కలుగుతున్నది. గతేడాది మే 27న నీటి ప్రవాహంలో వంతెన దాటడానికి ప్రయత్నించిన జైనథ్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన యువకుడు కొట్టుకుపోయాడు. సరుకులు రవాణా చేసే లారీలు నీటి ప్రవాహానికి ప్రమాదానికి గురై వంతెన కింద పడిపోతున్నాయి. వర్షకాలం నాలుగు నెలలు ఈ వంతెనపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.