నెన్నెల/వేమనపల్లి/భీమారం/దండేపల్లి(జన్నారం)/దహెగాం, డిసెంబర్ 8 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. నెన్నెల మండలంలో కల్లాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తడంతో అన్నదాతలు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. వేమనపల్లి మండలం జిల్లెడ, బుయ్యారం, సూరారం తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదమయమయ్యాయి. పలుచోట్ల వరిధాన్యం, చేలల్లోని పత్తి తడిసి ముద్దయ్యింది. అక్కడక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
భీమారం మండలం నర్సింగాపూర్, భీమారం, దాంపూర్, ధర్మారం, రెడ్డిపల్లి, కొత్తపల్లి, మద్దికల్ గ్రామాల్లో అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసింది. జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో తూకానికి ఉన్న ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో శనివారం రాత్రి కురిసిన వానకు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా, కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలకొరిగింది. అనేక చోట్ల పత్తి తడిసి రంగు మారింది.