కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ సిర్పూర్(యు), మార్చి 7 : నాడు వెయ్యి ఎకరాలకు సాగు నీరందించిన రాఘాపూర్ చెరువు.. నేడు కనీసం మూడు వందల ఎకరాలకూ భరోసా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నది. గతేడాది వర్షాలు సరిగా పడక చెరువు నిండక.. దీని కింద వేసిన పంటలు ఎండిపోతుండగా, వాటిని పశువుల మేతకు వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలోని రాఘాపూర్ చెరువు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద యేటా యాసంగిలో వెయ్యి ఎకరాల్లో పంటలు పండించేవారు. (వానకాలంలో ఈ చెరువు నీటిని వాడుకోరు. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి పంటలు తీస్తారు) కానీ, ఈ ఏడాది సుమారు మూడు వందల ఎకరాలే సాగు చేస్తున్నారు. ఆ పంటలు కూడా పూర్తిగా ఆరుతడి పంటలే కావడం గమనార్హం. వర్షాలు సరిగా పడకపోవడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో చెరువు కింద పంటలు వేయడం చాలా వరకు తగ్గించారు. చెరువు కాలువలకు ఆనుకొని ఉన్న కొంత మంది రైతులు మాత్రమే మూడు వందల ఎకరాల వరకు ఆరుతడి పంటలు వేశారు. కనీసం కాలువలకు మరమ్మతులు చేసి నీరందించాల్సి ఉండగా, పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇక చేసేదేమీ లేక రైతులు వాటిని పశువులకు వదిలేస్తున్నారు.
రాఘాపూర్ చెరువు కింద నాకు ఐదెకరాలు ఉంది. వానకాలంలో వర్షాధార పంటలే వేస్తా. యాసంగిలో మాత్రం రాఘాపూర్ చెరువు మీద ఆధారపడి సాగు చేస్తా. ఎప్పటిలాగే ఈ యాసంగిలో కూడా ఐదెకరాల్లో జొన్న వేసిన. చెరువు నీళ్లందక రెండెకరాలు ఎండిపోయినయి. గా పంటను పశువుల మేతకు వదిలేసిన.
– కనక గోవిండ్రావు, రైతు
నాకు రాఘాపూర్ చెరువు కింద ఆరెకరాల భూమి ఉంది. యేటా యాసంగిలో చెరువుపై ఆధారపడి సాగు చేసేటోన్ని. ఈ ఏడాది చెరువులో నీళ్లు లేక మొత్తానికే పంటలేయలేదు. ఈ చెరువు కింద సాగు చేసిన రైతుల్లో కొందరు పంటలను పశువులకు వదిలేస్తున్నారు.
– ఆడ లింగారావు, రైతు