ఆదిలాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు. ఉదయం సిలిండర్ల కోసం జనం ఏజెన్సీ కేంద్రానికి వచ్చారు. బుకింగ్ ప్రకారం కొందరికీ సిలిండర్లు పంపిణీ చేసిన నిర్వాహకులు స్టాక్ అయిపోయిందని తెలిపారు. మిగతా వారికి రశీదులు రాసిచ్చి స్టాక్ వచ్చిన తర్వాత రావాలని సూచించారు. ఎప్పుడు వస్తుందని వినియోగదారులు నిర్వాహకులను అడుగగా.. చంద్రాపూర్ నుంచి రావాల్సి ఉందని, మధ్యాహ్నం 3 గంటలకు వరకు వచ్చే అవకాశాలున్నాయన్నారు. దీంతో వినియోగదారులు చేసేదేమి లేక ఖాళీ సిలిండర్లతో వెనుదిరిగారు. గ్యాస్ కొరత లేదని అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నా.. ఏజెన్సీ నిర్వాహకులు స్టాక్ అయిపోయిందని అంటున్నారని జనం అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటో ఛార్జీలకు రూ.100 ఖర్చు చేయాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం రోజుల తరబడి తిరుగాల్సి వస్తున్నదని, నిబంధనల ప్రకారం తమకు అవసరమైన సిలిండర్లు పంపిణీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
రశీదు ఇచ్చి మధ్యాహ్నం రమ్మన్నారు..
మా సిలిండర్ అయిపోవడంతో బుక్ చేసుకొని ఖాళీ సిలిండర్‌తో ఏజెన్సీ కేంద్రానికి వచ్చా. క్యూలైన్లో నిల్చోని లోపలికి వెళ్లిన తర్వాత నిర్వాహకులు రశీదులు రాసిచ్చారు. సిలిండర్ ఎప్పుడు ఇస్తారని అడిగితే స్టాక్ అయిపోయిం దని, మధ్యాహ్నం వరకు స్టాక్ వస్తుందని చెప్పారు. ఫోన్ చేసి రమ్మన్నారు. దీంతో ఖాళీ సిలిండర్‌తో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. నాతోపాటు క్యూలైన్లో నిల్చోని ఉన్న చాలా మంది వినియోగదారులకు సిలిండర్లు దొరుకలేదు. అధికారులు సిలిండర్ల వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి.
-గోవర్ధన్‌రెడ్డి, మావల