‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న ఆయన దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రైతులతోపాటు అన్ని వర్గాలకూ మేలు జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మన రాష్ట్రం ఏర్పడింది. స్ఫూర్తిగా నిలిచింది. ఇదే తరహాలో దేశం ప్రగతి సాధించాలంటే, ప్రజలందరికీ ఫలాలు అందాలి అంటే కేసీఆర్ ప్రధాని కావడమొక్కటే మార్గం’. అని ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మండలాలకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల వసతులు సమకూరాయి. పరిశుభ్రత, పచ్చదనం, రోడ్లు, తాగు, సాగునీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యం, విద్య ఎంతో మెరుగుపడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. ఎనిమిదేళ్లలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ప్రజలు ఎంతగానో ఆదరిస్తారు. ఆయన ప్రధాని అయితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఇలా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
కేసీఆర్ ప్రధాని కావాలి
హాజీపూర్, సెప్టెంబర్ 20 : డబుల్ ఇంజిన్ పాలన అని చెప్పుకునే బీజేపీ ప్రభు త్వం రాజ్యాంగ విరుద్ధంగా అనేక రాష్ట్రాల్లో ప్రభు త్వాలను కూలగొడు తున్నది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నది. ప్రధాన మంత్రి కుల, మతాలను పట్టుకొని వేలాడుతూ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బిల్లును ముఖ్యమంత్రి వ్యతిరేకించడంతో నరేంద్ర మోదీ తలొగ్గి రైతు బిల్లు వెనక్కి తీసుకున్నారు. బీజేపీ పాలనతో దేశ ప్రజల తలసరి ఆదాయం క్షీణిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ ప్రజలందరికీ అందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి.
– పూస్కూరి శిల్ప, జడ్పీటీసీ, హాజీపూర్
కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతిస్తాం..
బెల్లంపల్లి, సెప్టెంబర్ 20 : తెలంగాణలోని నిరుపేద ముస్లింల కుటుంబాల్లో వెలుగులు నింపినట్లుగానే దేశంలోని ముస్లింల జీవితాలు బాగు చేయాల్సిన అవసరముంది. ఇది ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. తెలంగాణ రాకముందు ముస్లింల బతుకులు అధ్వానంగా ఉండేవి. ఆడపిల్లల పెండ్లిళ్లు చేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షాదీముబారక్ పథకం తీసుకొచ్చి భరోసానిచ్చాడు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారు. సచార్ కమిటీ ప్రకారం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కేంద్రంతో కొట్లాడుతున్నారు. బీజేపీ సర్కారు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకుంటోంది. ఇమామ్, మౌజన్లకు ప్రతినెలా రూ.6వేల వేతనం ఇస్తున్నందుకు గర్వంగా ఉంది. దేశంలోని ముస్లింలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. దేశానికే రోల్ మోడల్ అయిన కేసీఆర్ సేవలు భారతదేశానికి అవసరం.
– ఎండీ నిజామొద్దీన్, మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు.
దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం ..
ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌కు దేశంలోని రైతులు, ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ర్టాలు పథకాలను కాపీ కొడుతున్నాయి. దేశంలో బీజేపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను బడాబాబులకు అప్పగిస్తున్న మోదీ ప్రభుత్వం పేదలు, కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలోని జాతీయ పార్టీని ప్రజలు పూర్తిగా ఆదరిస్తారు. మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో రైతులు, కులవృత్తులు, పేదలు, అన్ని వర్గాల ఉపాధిని మెరుగుపర్చిన కేసీఆర్ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు. – సుభాష్ గాడ్గే, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు
ఆసక్తిగా చూస్తున్నారు..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తీసుకొచ్చిన నేతగా కేసీఆర్‌కు గుర్తింపు ఉంది. రైతులు, యువకులు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాలు తెలిసిన కేసీఆర్ దేశానికి దిక్సుచిగా మారాలని కోరుతున్నారు. అన్ని రంగాలపైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జాతీయ పార్టీని పెడితే బాగుంటుంది. తెలంగాణలో చిన్నచిన్న గ్రామాలు కూడా అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి అభివృద్ధినే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు మన రాష్ర్టానికి వచ్చి అభివృద్ధిని చూసి అభినందిస్తున్నారు. ఇలాంటి నేత దేశాన్ని పాలిస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. అందుకే కేసీఆర్ దేశ రాజకీ యాల్లోకి వచ్చి చక్రం తిప్పుతారన్న దానిలో సందేహం లేదు. – మలపతి అశోక్, ఎంపీటీసీ, జామిడి, తాంసి మండలం.
భవిష్యత్‌కు దిక్సూచి ..
ఉద్యమనేత సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తున్నది. గ్రామస్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అన్ని కులాలు, మతాలు సామరస్యతతో ముందుకెళ్తున్నాయి. అదే సమయంలో కేంద్రం తీరు చూస్తే మాత్రం కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రయత్నిస్తున్నది. పథకాలన్నీ మావే అని ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారారు బీజేపీ పెద్దలు.. ధరల పెంపు, ప్రైవేటీకరణ, ఈడీ, సీబీఐ దాడులపైనే దృష్టి పెట్టారు. ఇవి అనైతిక రాజకీయాలని సామాన్యుడికీ తెలిసింది. దేశం ఎటు పోతుందో అర్థంకాని ఈ క్లిష్ట పరిస్థితుల్లో కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉంది. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తే ప్రజలు గుండెన పెట్టుకుంటున్నారు. ఆయన భవిష్యత్‌కు దిక్సూచిలా కనిపిస్తున్నారు. ఇప్పుడు భారతావని నిఖార్సయిన నాయకుడిని కోరుకుంటున్నది. అది కేసీఆరే.
– గడ్డం లస్మన్న, వైస్ ఎంపీపీ ,భీంపూర్ మండలం
శుభపరిణామం..
నిర్మల్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) : దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగు పెడుతుండడం శుభపరిణామం. గతంలో ఎవరూ కూడా రైతుల బాగోగులు పట్టించుకోలేదు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు మొదలగు సదుపాయాలు ఇక్కడి రైతులకు వరంలా మారాయి. కొత్తగా ఏర్పడ్డ మా మండలంలో కూడా ఊహించని అభివృద్ధి జరిగింది. జడ్పీ నిధులతో దస్తురాబాద్, మున్యాల్, భుట్టాపూర్, మల్లాపూర్, దేవునిగూడెం తదితర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. ఇలా ఒక వైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి కేసీఆర్ తీసుకోబోయే చారిత్రక నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.
– ఎస్.శారద, జడ్పీటీసీ, దస్తూరాబాద్ మండలం.
రాణించే సత్తా ఉంది..
కోటపల్లి, సెప్టెంబర్ 20 : రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశ రాజకీయాల్లో రాణించే సత్తా ఉంది. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన దేశానికి ప్రధాని అయితే రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుంది. కేంద్రంలో ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశ రైతాంగానికి, దేశ ప్రగతికి చేసింది ఏమిలేదు. ప్రస్తుతం కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– మారిశెట్టి తిరుపతి, ఎంపీటీసీ, జనగామ
దేశం బాగుపడుతది..
తాండూర్, సెప్టెంబర్ 20 : ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆరే ఉండాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆయన పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఆయన గొప్ప అనుభవశాలి. దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో జరగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కేసీఆర్ ప్రధాని అయితే అన్ని రాష్ర్టాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయి. భారతదేశాన్ని కాపాడే శక్తి, సత్తా ఉన్న గొప్ప వ్యక్తి ఆయన.
– సిరంగి శంకర్, ఎంపీటీసీ, తాండూర్