ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు రెండో రోజైన బుధవారం యుద్ధ భూములను తలపించాయి. లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు ఉన్నాయంటూ.. అర్హుల పేర్లు జాబితాల్లో లేవంటూ జనం తిరగబడ్డారు. అర్హుల పేర్లు లేకుండా అధికార పార్టీ చెప్పినోళ్ల పేర్లతో జాబితాలు సిద్ధం చేశారా? అంటూ ప్రశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామ, వార్డు సభల్లో రెండో రోజైన బుధవారం నిరసనలు, నిలదీతలు, ఆందోళనలు కొనసాగాయి.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని బన్సపెల్లి, మామడ మండలం న్యూలింగంపెల్లిలో లబ్ధిదారుల ఎంపికలో లోటు పాట్లు ఉన్నాయంటూ జనాలు అధికారులను నిలదీశారు. ఏ ప్రతిపాదిక ఎంపిక చేశారో చెప్పాలని, పేదలమైన మా పేర్లు ఎందుకు జాబితాలో రాలేదని గొడవకు దిగారు.
నిర్మల్ మండలంలోని అక్కాపూర్ లబ్ధిదారుల జాబితా లో మా పేర్లు లేవని, లబ్ధిదారుల జాబితాలను చింపేయాలని నిరసన తెలిపారు.
ముథోల్ మండలంలోని తరోడాలో అర్హుల పేర్లు రేషన్ కార్డు జాబితాలో రాలేవని అసంతృప్తి వ్యక్తం నిరసన తెలిపారు. తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామసభకు చేరుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడం ప్రజలు శాంతించారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు కాలేదంటూ గ్రామసభలో స్థానికులు ఆందోళన చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాంపూర్లో అర్హుల కోసం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ స్థానికులు నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇండ్లు కట్టివ్వలేదని కాంగ్రెస్ నాయకులు అనడంతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది, మన్నూర్, గర్కంపేట్, శంభుగూడ, ముత్నూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని అధికారులు చెప్పడంతో శాంతించారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గోముత్రి గ్రామసభలో రుణమాఫీ కాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం జేశారు. కాగా.. గ్రామసభల ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలంలో నిర్వహించిన గ్రామసభలు పోలీసు పహారా మధ్య కొనసాగాయి. ఎన్నడూ లేని విధంగా పోలీసులు గ్రామసభల వద్ద ఉండడం విమర్శలకు తావిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు నిలువరించారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గోటూరి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒకరిని మాత్రమే ఎంపిక చేశారని అసలైన అర్హులను గుర్తుంచలేదని గ్రామస్తులు అధికారులతో వాపోయారు.