కాగజ్‌నగర్, ఫిబ్రవరి 18 : కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దవాఖానలో సూపరింటెండెంట్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు అంబాల ఓదెలు, కలికోట రమణయ్య, షబ్బీర్ హుస్సేన్, గోలం వెంకటేశ్ విలేకరులతో మాట్లాడారు.
ఈఎస్ఐ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కళకళాలాడిన ఈఎస్ఐ దవాఖాన ప్రస్తుతం ఆలనా పాలనా లేక వెలవెలబోతుందన్నారు. ఈఎస్ఐ దవాఖానను ఇక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని, అలా చేస్తే కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ జగన్ సైతం దూరప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడని ఆరోపించారు. దవాఖాన తరలించకుండా నివేదికలు పంపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సైతం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి నూతన భవనాలు నిర్మించాలని, లేదంటే కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు అన్నం రాజన్న, శ్రీనివాస్, వెంకటేశ్, రాజేశ్ పాల్గొన్నారు.