కౌటాల, సెప్టెంబర్ 2 : నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, వెంటనే పరిష్కరించాలని తలోడి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సమస్యలపై పలుమార్లు కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాల నేపథ్యంలో ఇండ్ల చుట్టూ మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతున్నదని, డ్రైనేజీల్లో చెత్తాచెదారం, వర్షపు నీరు నిండి రోడ్లపైకి వరద వస్తున్నదని, ఆదివారం తలోడి గ్రామ పాఠశాల సమీపంలోని డ్రైనేజీలో ఓ మూడేళ్ల బాలుడు పడిపోగా, స్థానికులు కాపాడారని చెప్పారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండు రోజుల క్రితం బిట్టుపల్లి గంగన్నకు చెందిన గేదె స్ట్రీట్ లైట్ పోల్ తగిలి మృతి చెందిందని ఆరోపించారు.
ఏ ఒక్క రోజూ బ్లీచింగ్ చల్లిన దాఖలాలు లేవని, దోమలు పెరిగి.. జ్వరాలు వచ్చి మంచం పట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో పొలాల అమవాస్య పండుగను చీకట్లో జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకొని.. గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎంపీవో మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.