నిర్మల్ అర్బన్, నవంబర్ 24 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులను ఉత్తములుగా, విజ్ఞానవంతులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలకు వచ్చామా? పాఠాలు చెప్పామా? వెళ్లామా? అనే ధోరణిలో వ్యవహరించడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయుల, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శనివారం కలెక్టర్ అభిలాష అభినవ్ మామడ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేయడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో వెల్లడైంది. దీంతో ప్రత్యేకాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసి, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన ఎస్వో, ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులను జారీ చేసి పద్ధతి మార్చుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని 18 కేజీబీవీలలో కొంతమంది ఉపాధ్యాయులు ఇష్టారీతిన సమయపాలన పాటించడం లేదు. పాఠశాలకు సమయానికి చేరుకున్న తర్వాత లొకేషన్‌ను షేర్ చేయాల్సి ఉండగా లైట్‌గా తీసుకుంటున్నారు. ఉదయం 9.15 గంటలకు ప్రార్థన సమయంలో విద్యార్థులతో కలిసి పాల్గొనాల్సి ఉండగా.. 10 గంటల తర్వాత విధులకు హాజరవుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. గతంలో నిర్మల్ డీఈవోగా విధులు నిర్వర్తించిన రవీందర్‌రెడ్డి ఖానాపూర్లోని కేజీబీవీని తనిఖీకి చేయగా ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. మిగతా వారందరూ ఇష్టారీతిన పాఠశాలకు రావడంతో పద్ధతి మార్చుకోవాలని, లే కుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ఒక్క ఖానాపూర్ కేజీబీవీలోనే కాకుండా మిగతా కొన్ని కేజీబీవీల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తేటతెల్లం అవుతున్నది. తనిఖీలు చేసిన రెండు, మూడు రోజులు సమయపాలన పాటించి ఆ తర్వాత షరామామూలుగా వ్యవహరిస్తున్నారు.
కేజీబీవీల్లో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తుండగా.. దాదాపు 6 వేల మంది చదువుకుంటున్నారు. సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు మాత్రమే నైట్ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి కేజీబీవీలో ప్రత్యేక అధికారి(ఎస్వో) వారానికి రెండు రోజులు వసతి గృహాల్లో నిద్రించి విద్యార్థుల ప్రగతి, వారి బాగోగులు, సమస్యలను తెలుకుని సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. సోన్, నర్సాపూర్(జి) ఎస్వోలు మినహా ఇతర ఎస్వోలు నైట్ డ్యూటీలు నిర్వహించకుండా విద్యార్థుల పర్యవేక్షణను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని కేజీబీవీల్లో ఘటనలు జరిగినా ఉపాధ్యాయుల్లో చలనం రావడం లేదు. గతంలో నర్సాపూర్(జి) కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ అయి కొంత మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా అప్పటి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఎస్వోను విధుల నుంచి తొలగించి, అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేజీబీవీలను నిత్యం పర్యవేక్షించాల్సిన సెక్టోరియల్, డీఈవో అధికారులు వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో విద్యావ్యవస్థ గాడిన పడాలంటే విద్యాశాఖ అధికారులతోపాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవసరం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈవో రామారావుతోనైనా కేజీబీవీ పాఠశాలల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.
నిర్మల్ జిల్లాలోని కేజీబీవీలపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతాం. పాఠశాల ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులందరూ హాజరుకావాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక అధికారులు వసతి గృహాల్లో నిద్రించేలా చర్యలు తీసుకుంటాం.