కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు.. అటవీ ఆంక్షలతో నిలిచిపోయిన రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు.. నిర్వహణ లేక పల్లెలకు చేరని మిషన్ భగీరథ నీరు.. ఇలా ఒకటేమిటి ప్రజలు అనేక అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక హామీలు నెరవేర్చగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలపై ఏమాత్రం స్పందించడం లేదంటూ అడవిబిడ్డలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, కెరమెరి మండలం కొలాం కొఠారి గ్రామంలో నిర్మించిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ ప్రారంభోత్సవానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వస్తుండగా, హామీలపై ఆయన ఏ మేరకు స్పందిస్తారోనని ఆదివాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోడు సమస్యలపై నిత్య పోరాటం
తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసులు, పోడు పట్టాల కోసం నిత్యపోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటునన భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు హద్దులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో రైతులు తిరుగబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 43 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించారు. దీంతో జిల్లాలో పోడు సమస్యలు కొంత మేరకు పరిష్కారం అయినప్పటికీ, ఇంకా చాలా మందికి పట్టాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి పట్టాలు లేని పోడురైతులపై అటవీ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయి.
ప్రాణ సంకటంగా మారుతున్న వాగులు
వర్షాకాలం వచ్చిందంటే చాలు జిల్లాలోని అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వాగులు.. వంకలపై వంతెనలు లేకపోవడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచి అడవిబిడ్డలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. జిల్లాలో దాదాపు 30 రోడ్లు అటవీ శాఖ అనుమతులు లేక అర్ధాంతరంగా ఆగిపోయాయి. కేసీఆర్ సర్కారులో జిల్లాలో 40 వరకూ వంతెనలు నిర్మించింది. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి ఒక్క వాగుపై కూడా వంతెనగానీ, రోడ్డు గానీ పూర్తి చేయలేకపోయింది.
అసంపూర్తిగా ప్రాజెక్టులు
కుమ్రం భీం ప్రాజెక్టు ప్రధాన కట్టకు పగుళ్లు తేలి దాదాపు మూడేళ్లు గడుస్తున్నప్పటికీ మరమ్మతుల కోసం ఒక్క రూ పాయి కూడా ఖర్చుచేయలేదు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ మట్టితో వట్టివాగు ప్రాజెక్టు అంతరించిన పోతున్నా సర్కారు కన్నెత్తి చూడడం లేదు. జిల్లాలో దశాబ్దాల క్రితమే నిర్మాణం చేపట్టి న పీపీరావు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులు నేటికీ అసంపూర్తిగా నే ఉన్నాయి. కొద్ది రోజులుగా ప్రాణహితపై బరాజ్ నిర్మిస్తామని ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ఉన్న పెండిం గ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2008లోనే ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా ప్రాణహితపై బరాజ్ నిర్మాస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను జిల్లా ప్రజలు నమ్మేపరిస్థితి కనిపించడం లేదు. కనీసం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులనైనా పూర్తిచేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు.
అటవీ అధికారులు అడ్డుపడుతుంటే పట్టించుకోని సర్కారు
జిల్లాలోని అనేక సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాల పేరిట.. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు దాదాపు 7వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిలో ఎన్ని పూర్తి చేసిందో చెప్పాలని డి మాం డ్ చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఇం దిరమ్మ ఇండ్లు ని ర్మించుకోకుండా అటవీ అధికారు లు అడ్డుపడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది.
నేడు జిల్లాలో సీఎం పర్యటన
ఆసిఫాబాద్ టౌన్/రెబ్బెన, మే 31 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి సుమారు 5.45 గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకోనున్నారు. ఆపై కెరమెరి మం డలం కొలాం కొఠారి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు, సీఎం సామూహిక గృహప్రవేశాలు నిర్వహించ నున్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్లు డేవిడ్, యూవరాజ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో దాసరి వేణు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అత్యవసర వైద్య సేవలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు , అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం సభ ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు.. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు ప్రేంసాగర్‌రావు, వినోద్‌తో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ హరిత, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఎస్పీలు నితికా పంత్, అఖిల్ మహాజన్ సభ ఏర్పాట్లు పరిశీలించి సలహాలు ఇచ్చారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ ఓ ప్రకటనలో తెలిపారు.