కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతాంగం పత్తి పంట వైపు మొగ్గుచూపుతున్నది. గతేడాది వానకాలం సీజన్లో 3.34 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నది. జిల్లా మొత్తంగా 4.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తుండగా, ఇందులో అత్యధికంగా దూదికి ప్రాధాన్యమివ్వడం కనిపించింది. యేటేటా పెరుగుతున్న ధరలకనుగుణంగా పత్తిపై అన్నదాతలు ఆసక్తి చూపుతుండగా, మిగతా పంటల సాగు క్రమంగా తగ్గుతున్నది.
3.35 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో గతేడాది ఏడాది వానాకాలం సీజన్లో 3.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం వానకాలంలో 3,35,363 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే సుమారు 1363 ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో ఆహార పంటలపైపు అధికంగా మొగ్గుచూపిన రైతులు.. కొన్నేళ్లుగా పత్తి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు.
పత్తి ధరలు యేటేటా పెరుగుతుండడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతున్నది. ఇదేకాకుండా వరి, ఇతర ఆహార పంటలకు గిట్టుబాటు ధర ఉంటుందో లేదోనన్న అనుమానాలు రైతులను పత్తి సాగువైపు మళ్లిస్తున్నాయి. జిల్లా మొత్తంగా 4లక్షల 45 వేల 49 ఎకరాల్లో పంటలు సాగవుతుంటే ఇందులో అత్యధికంగా పత్తి సాగవుతోంది. ఇక కొంత మంది రైతులు మాత్రమే కూరగాయల సాగువైపు మొగ్గుచూపున్నారు.
తగ్గిన ఆహార ధాన్యాల సాగు
జిల్లా రైతాంగం వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నది. ఇందులో పత్తికే అత్యధికంగా ప్రాధాన్యమిస్తున్నది. వాణిజ్య పంటల సాగుతో అధికంగా లాభాలు వస్తాయని భావించి ఆహార ధాన్యాలు సాగు చేయడం తగ్గిస్తున్నారు. గతంలో జిల్లాలో వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుములు, శనగ, చిక్కుడు, కందిని అత్యధికంగా సాగు చేసేవారు. నువ్వులు, పొద్దుతిరగుడువంటి పంటలతో పాటు కూరగాయలు కూడా అధికంగా సాగయ్యేవి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నా..
సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి.. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు రసాయన ఎరువులతో పత్తి పంటను సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. పైగా పత్తిపై చీడపీడలను నివారించేందుకు రసాయన ఎరువులను విపరీతంగా వాడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటుంది. ఇక పత్తి అధికంగా సాగు చేయడం వల్ల పశువులకు కూడా ఆహార కొరత ఏర్పడుతోంది.
ఇంటికి అవసరమైన ఆహార పంటల సాగు పోగా.. మిగిలిన భూమిలో రైతులు పత్తి సాగుకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. వ్యయసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులకు ఆహార పంటల సాగు పెంచాలని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను వ్యవసాయ అధికారులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. రైతుల్లో ఆశించినంతగా మార్పు కనిపించడం లేదు. పైగా పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఆహార పంటలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆహార పంటల్లో వరి తప్ప.. మిగతా ఏ పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పత్తి పంటసాగుపై ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతుంది.