“కేంద్రంలోని బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకు రావడం వల్ల కార్మికులకు నోటీసులు ఇవ్వకుండానే తొలిగించే హక్కు పరిశ్రమలకు చేకూరుతుంది. సింగరేణి సంస్థను బొగ్గు గనుల వేలంతో ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. సీఎం కేసీఆర్ రైతు, దళితబంధు పథకాలతో జనరంజక పాలన సాగిస్తున్నారు.” అని తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన మద్ది శంకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో కల్లోలం మొదలైంది. అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతుండగా.. తెలంగాణ ఆవిర్భావాన్ని కించపరిచేలా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేశాయి. కొందరు నాయకుల ఆధిపత్య ధోరణి, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆవిర్భావాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడడం వల్ల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు నాయకులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ రాజీనామా చేసి ప్రధానితోపాటుగా ఆ పార్టీ నాయకత్వాన్ని ఎండగట్టిన తీరు హాట్‌టాపిక్ మారింది. కాగా.. మరికొంత మంది కూడా బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణప్రతినిధి/మంచిర్యాల) : దశాబ్దాలపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తూ ఇటీవల పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ మాటలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గు మంటున్నది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం రావాల్సిన నిధులు, నీళ్లు కేటాయింపుల వంటివి చేయకపోగా.. ఏకంగా తెలంగాణ ఆవిర్భావం సరిగా జరగలేదంటూ బీజేపీ అధినాయకత్వం మాట్లాడిన తీరుపై ప్రజలు, మేధావులు మండి పడుతున్నారు. దీనిని కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పడరాన్ని పాట్లు పడుతున్నా.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులను జనం నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని అలా మాట్లాడితే.. మీరెందుకు స్పందించడం లేదంటూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. నాయకులు అంతర్మథనంలో పడుతున్నారు.
ఒకవైపు పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ఆవిర్భవాన్ని అవమానిస్తూ మాట్లాడిన తీరుపై బీజేపీలో కలకలం రేగుతుండగా.. అలాగే సింగరేణి బొగ్గు గనుల వేలం తీరుపై కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోవైపు గ్రూపు రాజకీయాలతో సతమతవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడేందుకు పలువురు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. తాజాగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాలలోని మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్ రాజీనామా చేసి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరును ఎండగట్టగా.. అదేబాటలో సాగేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటుండడంతో ఆ పార్టీలో ముసలం మొదలయ్యింది.
సింగరేణిపై కేంద్రం కుట్రను నిరసిస్తూ కార్మికులు ఇటీవల ఆందోళనలు చేశారు. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు మోదీ ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలోనూ రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు మూడు రోజులు సమ్మె చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప ట్టించుకోలేదని శంకర్ మండిపడ్డారు. కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్‌పల్లి, కేకే 6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని రాష్ట్రప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి ఆ పార్టీని పలువురు త్వరలోనే వీడే అవకాశం ఉందని, అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీలో విలువలేదని పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ మద్ది శంకర్ రాజీనామా చేయడం మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు పట్టణ ఉపాధ్యక్షుడు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి దోనుగు రమేశ్, పట్టణ కోశాధికారి మురళి, యువమోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షుడు బండి రవి, కెల్లేటి తిరుపతి కూడా పార్టీని వీడింది తెలిసిందే. తెలంగాణ సమాజంపై వివక్ష చూపుతున్న పార్టీ విధానాలతో విసిగిపోయామని వారు బాహాటంగా ప్రకటించడంతో బీజేపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. రాష్ర్టాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న మోదీ విధానాలు నచ్చక వారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. విభజన చట్టా న్ని తుంగలో తొక్కడం, హామీలను అటకెక్కించడం, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌కు ధా రాదత్తం చేయడం, బడ్జెట్లోనూ మొండిచేయి చూపడం, విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు తహతహలాడడం.. వంటి పలు అంశాలు నచ్చక ఆ పార్టీకి స్వస్తి పలుకుతున్నారు.