భైంసా/ఉట్నూర్/ఇంద్రవెల్లి/కుంటాల/ నేరడిగొండ/ముథోల్/కుభీర్/ ఏప్రిల్ 6 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్మార్పీస్, సీఐటీయూ, జేఏసీ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేశారు. మరి కొందరికి హౌస్ అరెస్టు కూడా చేశారు. బాసరలో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా నిరుద్యోగ జేఏసీ కొత్తూరు శంకర్‌ను సైతం ముందస్తు అరెస్టు చేశారు.
ఈయనతోపాటు బీఆర్ఎస్ నాయకులు అజీజ్ ఖురేషి, అమీద్ ఉన్నారు. ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, బీఆర్ఎస్ నాయకులు భరత్ చౌహన్, బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణీ రాజేశ్, బీజేపీ నాయకులు కిరణ్, వెంకటేశ్‌లను అరెస్టు చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కాంబ్లే బాలాజీను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కుంటాలలో కూడా కల్లూర్ సర్పంచ్ దశరథ్, మండల పార్టీ కన్వీనర్ పడకంటి దత్తాత్రిలను అరెస్టు చేశారు.
నేరడిగొండలో లైవ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, మాజీ సర్పంచ్‌లు కుమ్రం జంగు, సోలంకి గీత కరణ్‌సింగ్, రోల్ మామడ సర్పంచ్ హంసబాయి, గంగామణిలను అరెస్టు చేశారు. ముథోల్‌లో మాజీ ఎంపీటీసీ గంగాధర్, శంకర్, శ్రీకాంత్, రాజ్‌కుమార్, గంగారెడ్డిలను అరెస్టు చేశారు. కుభీర్ మండలంలో ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నీల అనిల్, బీఆర్ఎస్ మండల నాయకులు, మాజీ మండల వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మాజీ సర్పంచ్ బాబులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ సమస్యలపై విన్నవించుకునేందుకు వెళ్తున్న ఆశ వర్కర్లు, సీఐటీయూ నిర్మల్ జిల్లా కార్యదర్శి సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Adilabad
ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకులను కాంగ్రెస్ సర్కారు గొంతునొక్కుతున్నదని పలువురు మండిపడ్డారు. ప్రభుత్వం దళితులకు న్యాయం చేయడం లేదని, నిరుద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేస్లాపూర్ జాతరకు వచ్చిన సీఎం ఉట్నూర్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హమీచ్చారన్నారు. ఆ దిశగా అడుగులు వేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఏ ఒక్క పేద దళితుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజురు కాలేదన్నారు. దళితుల కోసం కేటాయించిన రూ.85 వేల కోట్లను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించి మోసం చేస్తుందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, పరిష్కారం అయ్యే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, తమ పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.