ఎదులాపురం,జనవరి 21 : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను బాధ్యతగా పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, లారీ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒకరూ వాహన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. \ప్రతి ఆటో యజమాని ‘అభయ మై టాక్సీ ఇస్ సేఫ్’ అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, దీని ద్వారా లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఆటోలలో టాక్సీలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను, వాటిని రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 300 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన వైద్యులు సుమన్, ప్రశాంతి వైద్య పరీక్షలు చేశారు. నిరుపేద డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బీ సునీల్ కుమార్, కే నాగరాజు, బీ ప్రణయ్ కుమార్, రిమ్స్ వైద్యులు ప్రశాంతి, సుమన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.