నార్నూర్ : భూగర్భ జలాల(Ground Water) సంరక్షణ అందరి బాధ్యతని నార్నూర్ ఎంపీడీవో పుల్లారావ్ (MPDO Pullarao) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి, కొత్తపల్లి హెచ్, జామడ, మరప గూడ, ముల్లంగి, ఖైరదట్వా, నార్నూర్తో పాటు గాదిగూడ మండలంలోని ధాబాకే ప్రభుత్వ పాఠశాలలో మనబడి.. మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాల పరిధిలో ర్యాలీ ( Rally )నిర్వహించి నీటి సంరక్షణ పై అవగాహన కల్పించారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టు భూమిలోకి ఇంకిపోయేలా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని కోరారు. నీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత లేకుండా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాదవ్ విఠల్, ప్రత్యేక అధికారులు అరవింద్, నవీన్ రెడ్డి, గంగాధర్, సూపరింటెండెంట్ రాథోడ్ గంగా సింగ్ , టెక్నికల్ అసిస్టెంట్లు జాదవ్ కైలాస్, చౌహాన్ వికాస్, మోహన్, పంచాయతీ కార్యదర్శులు మోతిరామ్, రూప్ దేవ్, సుభాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.