ఎదులాపురం, ఆగస్టు 29 : తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముందుగా మూడు దశలలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పకడ్బందీగా దృష్టి కేంద్రీకరించాలని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఏర్పాట్లను నిశీతంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు.
ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావర ణం, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఓటరు జాబితా రూపకల్ప న, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియను తక్షణమే చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నా రు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చే ర్పులు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్ప ష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేలా చూడాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీపీవో శ్రీలత పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 29 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.