దహెగాం, జూలై 16: ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు అంబులెన్స్ గ్రామం వరకు రాకపోవడంతో ఓ గిరిజన గర్భిణి పురిటి నొప్పులతో నరకయాతన అనుభవిస్తూ ఎడ్లబండిపై వెళ్లి అవస్థలు పడిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఖర్జీ గ్రామ పంచాయతీ పరిధిలోని లోహ గ్రామంలో జరిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన కోరేక సంతోష్ భార్య పుష్పలత మొదటి కాన్పు కోసం ఆసిఫాబాద్ జిల్లాలోని లోహ గ్రామంలోని తల్లిదండ్రులైన సిడం రామయ్య, చిన్నక్క ఇంటికి వచ్చింది.
మంగళవారం పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో ఆశ కార్యకర్తలకు, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రోడ్డంతా బురదమయంగా మారడంతో అంబులెన్స్ ఖర్జీ దాటి లోహ గ్రామానికి వెళ్లే రోడ్డు వెంట అటవీ ప్రాంతం వరకే వచ్చింది. దీంతో పుష్పలతను అంబులెన్స్ వరకు ఆరుకిలోమీటర్లు ఎడ్లబండిపై కుటుంబసభ్యులు తీసుకురావడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమె మరింత అవస్థలకు గురైంది.
అంబులెన్స్‌లో దహెగాంలోని పీహెచ్‌సీకి తరలించగా సాధారణ ప్రసవంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు. మళ్లీ ఎడ్లబండిపైనే అవస్థలు పడుతూ తీసుకువచ్చారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు స్పందించి సుమారు 200పైగా జనాభా ఉన్న గ్రామానికి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరారు.