ఉట్నూర్, మార్చి 23 : గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఇన్చార్జి ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం పీవో క్యాంపు కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉట్నూర్ మండలంలోని ఉమ్రి సాలేవాడ గ్రామానికి చెందిన టేకం భీంరావు తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, బజార్హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన మాడవి జైతు తమ గ్రామానికి మహిళా భవనం మంజూరు చేయాలని, సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన కుంరం మధూకర్ తనకి ఏదైన గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా ఉద్యోగం ఇప్పించాలని, అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వచ్చిన గిరిజనులు తమకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రైతుబంధు, రైతుబీమ, వ్యవసాయ, రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో దామోదరస్వామి, పీవీటీజీ ఏపీవో భాస్కర్, జిల్లా వైద్యాధికారి మనోహర్ పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన ప్రజావాణిలో ఫిర్యాదులను ఇక నుంచి డిజిటల్ రూపంలోకి మార్చినట్లు ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ అన్నారు. సోమవారం ఫిర్యాదు విభాగంలో అర్జీలను ఆన్లైన్ చేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు, పారదర్శంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి అర్జీకి క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ సమస్య ఎంతవరకు వచ్చిందో తెలుస్తుందన్నారు. త్వరలోనే ప్రజలు తమ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా ఏఐ సహాయంతో తెలుసుకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.