నాగిరెడ్డిపేట/ నిజాంసాగర్, ఆగస్టు 6: ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. గురువారం ఉదయం నాటికి 3,565 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పది టీఎంసీలకు చేరువకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1398.67 అడుగుల (9.98 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా మహ్మద్‌నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌లోకి ఎగువ భాగం నుంచి 663 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నది. దీంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ 416.50 మీటర్ల పూర్థిసాయి నీటి మట్టంతో నిండి ఉంది.
పోచారంలోకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో…
పోచారం ప్రాజెక్టులోకి గురువారం ఇన్‌ఫ్లో కొనసాగినట్లు డీఈఈ కిష్టయ్య తెలిపారు. ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి 1,596 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతేస్థాయిలో నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.
నేడు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిని నేడు (శుక్రవారం)విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య గురువారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పొర్లడంతో వానకాలం పంటల కోసం నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.