కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మరో వారంలో యాసంగి కోతలు ప్రారంభం కానుండగా, యంత్రాంగం కొనుగోళ్ల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం.. మద్దతు ధర ప్రకటించకపోవంపై అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. అసలు సర్కారు సేకరణ చేపట్టేనా.. అన్న సందేహం వ్యక్తమవుతున్నది.
కొనుగోలు కేంద్రాలేవీ..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగిలో 22 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 23 వేల మెట్రిక్ టన్నల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బోర్లపై ఆధారపడి పంటలు వేయగా, ఈసారి కరెంటు కోతల వల్ల దిగుబడి తగ్గే అవకాశమున్నది. మరో వారంలో కోతలు ప్రారంభించే అవకాశముంది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతేడాది ఏప్రిల్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా, ఈసారి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే రైతులు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
మద్దతు ధరపై నిర్ణయమెప్పుడో..
గత వానకాలంలో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సన్నబియ్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు వేసిందో అధికారులకే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యాసంగిలో ధాన్యా న్ని ప్రభు త్వం కొనుగోలు చేస్తుందా.. లేదా అన్న సందే హం రైతుల్లో కనిపిస్తున్నది. గత వానకాలంలో వరికి క్వింటాలుకు రూ. 2350 మద్దతు ధర కల్పించగా, ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.