ఆదిలాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. విచారణ కోసం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకమై తెలంగాణ రైతాంగాన్ని నష్టపర్చే విధంగా పన్నాగం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇందులో భాగంగా కాళేశ్వరం విచారణను సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగించడాన్ని నిరసనలతో హోరెత్తించారు. ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా తోపులాట జరిగింది. రేవంత్‌రెడ్డి పేపర్ ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాతో ప్రజా రవాణాకు అంతరాయం కలగడం, పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా ముందస్తు సమాచారం, అనుమతి తీసుకోకపోవడంతో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌తోపాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు బోథ్ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై శ్రీసాయి తెలిపారు.
నిర్మల్ పట్టణలంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్మల్ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ తీశారు. భైంసా పట్టణంలోని జాతీయ రహదారిపై ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవార్, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ బీఆర్ఎస్ నాయకులతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామ శివారులో గల గోదావరి వంతెనపై నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు గంట వరకు నిరసన కొనసాగగా.. రెండు కిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం బాదనకుర్తి బుద్ధుడి విగ్రహం వద్దకు వెళ్లి శాంతిమార్గంలో మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సస్యశ్యామలంగా మారిన తెలంగాణను ఎడారిగా మార్చడానికి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో రామన్న మాట్లాడారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగాయని, 20 నెలలుగా వాటిని మరమ్మతు చేయించలేదని రేవంత్‌రెడ్డి రాద్ధాంతం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఘోష్ నివేదిక ఫేక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరూపించారని, సీబీఐని ప్రధాని మోడీ సంస్థ అని తప్పుపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం విచారణను సీబీఐకి ఎందుకు అప్పగిస్తున్నాడని ప్రశ్నించారు.
బడా భాయ్, చోటా భాయ్ అడుతున్న నాటమని, దీని వెనుక చంద్రబాబు పాత్ర ఉందన్నారు. విచారణ పేరిట ప్రాజెక్టు నిర్వహణను పక్కన పెట్టి చంద్రబాబు సూచనల మేరకు బనకచర్లకు నీళ్లు తీసుకుపోవడానికి సీఎం కుట్రలు చేస్తున్నారన్నారు. మేధావులు, విద్యావంతులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజ్జిగిరి నారాయణ, సాజిదొద్దీన్, రమేశ్, ధమ్మపాల్, రాజన్న, అయ్యూబ్, అర్షద్, ప్రశాంత్, స్వప్న పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో మాజీమంత్రి జోగు రామన్నను అడ్డుకుంటున్న పోలీసులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలకు నిరసనగా ఆదిలాబాద్ పట్టణంలో ర్యాలీ తీస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
భైంసా : ధర్నాలో మాట్లాడుతున్న ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు, నాయకులు
రేవంత్ రెడ్డి ఫొటోను దహనం చేస్తూ..
బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట