బాసర : నిర్మల్ జిల్లా బాసర ( Basara ) గోదావరి నదిలో ఆత్మహత్యా యత్నానికి (Suicide Attempt ) పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు గురువారం బాసర బ్రిడ్జికి ద్విచక్రవాహనంపై చేరుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి బ్రిడ్జిపై అనుమానంతో అటు ఇటూ కలియ తిరుగుతూ బ్లూకోట్ టీం పోలీసులు మోహన్ సింగ్, హోమ్ గార్డ్ దీపాలి కంట పడ్డాడు.
అతడిని పట్టుకుని విచారించి, తనిఖీ చేయగా అతడి జేబులో సూసైడ్ నోట్ కనిపించింది. వెంటనే పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇద్దరు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ముధోల్ సీ ఐ మల్లేష్, ఎస్సై గణేష్ అభినందించారు.