మంచిర్యాల, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోడు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు చేపట్టిన పాదయాత్రను హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లో గురువారం పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. రైతులను అరెస్ట్ చేసి తీసుకువస్తున్న వాహనాన్ని.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రేణులు కాగజ్‌నగర్‌లో అడ్డుకున్నారు. 50 ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకొని బతుకుతున్న రైతులు తమ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా, అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నాయకులను చెదర గొట్టారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు కాగజ్‌నగర్ ఇన్చార్జి లెండుగురె శ్యాంరావ్, బెజ్జూర్ నాయకుడు హర్షద్ హుస్సేన్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి కౌటాల పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా, సిర్పూర్ (టీ)లో నాయకులు మరోసారి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. వారిని తప్పించి.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురి నేతలను కౌటాల పోలీస్‌స్టేషన్‌కు చేర్చారు. ఈ విషయం తెలియడంతో బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్ వద్దకచేరుకొని ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. బస్టాండ్ సమీపంలోని కుమ్రం భీం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు నాయకులను బయటికి పంపించేశారు.
పోడు రైతుల బాధలు వినాల్సిన ముఖ్యమంత్రి పోలీసులతో అరెస్ట్ చేయించడం దారుణమని, అరెస్టులతో అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని, రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. రైతు డిక్లరేషన్ పేరు చెప్పి, రైతుల చేతులకు బేడీలు వేసి మోసం చేస్తున్నారన్నారు. లగచర్ల, గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్ట్ చేసిందన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో రైతులు స్వర్ణయుగం చూశారని, రైవంత్రెడ్డి పాలనలో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పోడు భూములపై హక్కులు కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పోడు భూముల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కంచ గచ్చిబౌలిలో వంద ఎకరాల భూమిని రాత్రికి రాత్రే నాశనం చేస్తే రేవంత్‌రెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదో అధికారులు చెప్పాలని నిలదీశారు. రేవంత్‌రెడ్డికో న్యాయం.. పోడు రైతులకో న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో లగచర్ల, కుందారం రైతులపై కేసులు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దిందా రైతులపై కేసులు పెట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర అటవీశాఖ మంత్రికి, మోదీకి, అమిత్‌షాలకు చెప్పి ఎందుకు న్యాయం చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. చేతకాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ధర్నాలు, నిరసనల నేపథ్యంలో కాగజ్‌నగర్‌కు తీసుకువచ్చిన దిందా రైతులను పోలీసులు కాగజ్‌నగర్ రూరల్, వాంకిడి, రెబ్బెన పోలీస్స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వారిని పోలీస్స్టేషన్లలోనే నిర్బంధించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను బయటికి పంపించాక సాయంత్రం 6 గంటల తర్వాత రైతులను సైతం వాహనాల్లో ఎక్కించుకొని దిందా గ్రామానికి తీసుకెళ్లారు. తమను అరెస్ట్ చేసి నిర్బంధించడంపై దిందా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి తీసుకెళ్లి వదిలేసినా మళ్లీ హైదరాబాద్‌కే వెళ్తామని, సీఎంను కలిసి తమ సమస్య చెప్పుకునే దాకా వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ భూములను సాగు చేసుకోనివ్వడం లేదని, పంట చేసుకోకుండా ఆకలితో సచ్చేకంటే.. సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చే దాకా పోరాడుతామన్నారు.
పోలీసులు వాహనాల్లో ఎక్కించేటప్పుడు కొట్టారని, బలవంతం చేశారని వాపోయారు. కనీసం భోజనం పెట్టకపోగా, మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పాదయాత్రగా శామీర్‌పేట్ రింగ్‌రోడ్డు దగ్గరికి వెళ్లాక పొద్దున్నే మేం బస చేసే చోటికి పోలీసులు వచ్చారన్నారు. ఒక ఐదుగురిని తీసుకెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కల్పిస్తామని, ఎవ్వరు వస్తారో చెప్పాలని నమ్మబలికారని.. అంతలోనే రెండు బస్సులను తీసుకువచ్చి బలవంతంగా అందులోకి ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా కలిసి మాట్లాడుకున్నాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని దిందా పోడు రైతులు డోకే రామయ్య, కంటే ప్రకాశ్, ధనుర్కార్ లక్ష్మయ్య తదితరులు తెలిపారు.
హైదరాబాద్ సమీపంలో రైతులను అరెస్టు చేయడంపై దిందా గ్రామస్తులు భగ్గుమన్నారు. వారికి మద్దతు తెలిపేందుకు గ్రామం నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సాయంత్రం పోలీసులు బందోబస్తు నడుమ రైతులను తీసుకొచ్చి గ్రామ సమీపంలో వదిలిపెట్టి వెళ్లారు. దీంతో గ్రామస్తులంతా అక్కడే వాగు వద్ద సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు.