నిర్మల్ జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇండ్లు, ఆలయాలు, వ్యాపార-వాణిజ్య సముదాయాలే లక్ష్యంగా చేసుకొని వరుస ఘటనలకు పాల్పడున్న దొంగల ముఠాలకు పోలీసులు బ్రేక్ వేస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో టైగర్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు పోలీసు విధులతోపాటు ప్రత్యేకంగా దొంగతనాల నివారణపై దృష్టి సారించి అడ్డుకట్ట వేస్తున్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 19 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గడిచిన మూడు నెలల్లో 108 కేసులు నమోదు కాగా.. 75 కేసులను పోలీసులు ఛేదించారు. ఇందులో రూ.45,63,750 నగదు అపహరణకు గురికాగా.. రూ.35,65,950 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దొంగతనాల నివారణకు జిల్లాలో 13 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇందులో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సారంగాపూర్, భైంసా టౌన్ ప్రాంతాల్లో ఐదు, వివిధ వైపుల నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి ప్రవేశించే ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటలపాటు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటూ వాహనాలు తనిఖీ చేస్తూ.. భద్రతను పర్యవేక్షిస్తూ అడ్డుకట్ట వేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటి నుంచి చోరీల సంఖ్య తగ్గడం మొదలైంది. దీంతో ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
నిర్మల్ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాను జిల్లా టైగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. వీరందరూ నిర్మల్ జిల్లాకు చెందిన వారు కాగా.. ఒక ముఠా ఏర్పడి మహదేవ్ పురం, శాస్త్రినగర్, ప్రియదర్శినినగర్, ఏఎన్‌రెడ్డి కాలనీ, గొల్లపేట్ కాలనీలలోని ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దివ్యనగర్ అయ్యప్ప ఆలయం, మహాలక్ష్మీ ఆలయం, శాస్త్రినగర్, బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయం, కౌట్ల(కె), కొరిటికల్, సారంగాపూర్, లోకేశ్వరం, లక్ష్మణచాంద, తానూర్ మండలాల్లోని ఆలయాల తలుపులు పగులగొట్టి ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించుకొని పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం, ఏలూరు పోలీస్స్టేషన్లలో కూడా వీరిపై కేసులు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లా ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాల కమిటీలు, వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రజలు, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా వారి కదలికలు గమనించిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. దొంగతనాల నివారణకు ప్రజల సహకారం అవసరమని ప్రజలు, పోలీసుల సమన్వయంలో ఆర్థిక నేరాలతోపాటు ఇతర నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంటున్నారు.