ఎదులాపురం, ఏప్రిల్ 3 : అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపీ, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల స్థితిగతులపై ఎస్పీ ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. గంజాయి పండించే వారిపై ప్రభుత్వ పథకాలు రాకుండా నివేదికలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో అండ్ ఇన్వెస్టిగేషన్ కేసులపై విచారణ జరిపి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైవేలలో ప్రమాదాలను నివారించడానికి హోల్డప్ ఏరియాలను గుర్తించి అందులోనే లారీలు వేచి ఉండేల, రోడ్లపై పారింగ్లు చేయకుండా చూడాలన్నారు.
నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. రాత్రి సమయాలలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలను సేకరించి ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, సిహెచ్ నాగేందర్, సీఐలు బి.సునీల్‌కుమార్, కరుణాకర్, శ్రీనివాస్, ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు.