ఉట్నూర్/నార్నూర్, జూన్ 15 : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలంలోని నాగల్‌కొండకు చెందిన జాదవ్ గజేందర్(41) బేల మండలంలోని మేడిగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతను జిల్లా కేంద్రంలోని శ్రీనగర్‌లో నివాసం ఉంటు న్నాడు. అయితే ఇతని భార్య జాదవ్ విజయలక్ష్మి నిజామా బాద్‌లో డిగ్రీ చదివేటప్పుడు రాథోడ్ మహేశ్‌తో ప్రేమలో పడింది. పెళ్లికి పె ద్దవాళ్లు ఒప్పుకోక జాదవ్ గజేందర్‌కు విజయలక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. కానీ.. అప్పటి నుంచి వీరి ప్రేమ వ్యవహారం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. గజేందర్ లేని సమయంలో మహేశ్ ఇంటికి వచ్చిపోయే వాడు. వీరి అక్రమ సంబంధం బయటపడడంతో పంచాయతీ పెట్టి మందలించారు. ఇక బదిలీలలో భాగంగా గజేందర్ సొంత మండలమైన నార్నూర్ పరిసరాలకు బదిలీ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు.
ఇదే జరిగితే తన వ్యవహారం నడవదన్న కోపంతో ప్రియుడితో కలిసి హత్యకు ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా బేల మండలంలో ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న బోడే సుశీల్, ఉర్వేత కృష్ణలకు తలో రూ.3 లక్షల చొప్పున ఇచ్చి హత్య చేయడానికి బేరం కుదుర్చుకుంది. ప్రణాళిక ప్రకారం ఈనెల 12వ తేదీన జైనథ్ మండలంలో విధులకు హాజరై తిరిగి వస్తుండగా.. గాదిగూడ మండలంలోని అర్జుని వద్ద సదరు సుఫారీలు జాదవ్ గజేందర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి, కింద పడ్డ అతనిని చేలలోకి లాక్కెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. తండ్రి బిక్కు నాయక్ కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విజయలక్ష్మిని తనదైన శైలిలో విచారించారు. ఇక ప్రియుడు, సుఫారీల బాగోతం బయటకు వచ్చింది. శని వారం పోలీసులు ఏ1 జాదవ్ విజయ లక్ష్మి, ఏ2 రాథోడ్ మహేశ్, ఏ3 బోడే సుశీల్, ఏ4 ఉర్వేత కృష్ణలను పట్టుకుని రిమాండ్‌కు పంపారు. వీరిపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉట్నూర్ సీఐ మొగిలి, నార్నూర్ సీఐ రహీం పాషా, సిబ్బంది ఉన్నారు.
జాదవ్ గజేందర్ హత్య జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హత్యను పోలీసులు తొందరగానే ఛేదించడంతో సుఫారీ హత్యగా బయటపడింది. దీంతో సుఫారీ తీసుకున్న వారు, రాథోడ్ మహేశ్‌తో ప్రేమ వ్యవహారం, హత్యకు వేసిన ప్రణాళికల వాయిస్ రికార్డులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టేలోగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.