నిర్మల్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రై తులు అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోపాటు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. 20 రోజులుగా పది శాతానికి మించి కొనుగోళ్లు చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించినా.. నేటికీ ఒక్క బస్తా కోనుగోలు చేయలేదు. ఫలితంగా ఎక్కడి ధాన్య ం అక్కడే కనిపిస్తున్నది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 1,17,085 ఎకరాల్లో వరి సాగైం ది. ఈ సీజన్లో 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 1.38 లక్షల మెట్రిక్ ట న్నులు దొడ్డురకం, 24 వేల మెట్రిక్ టన్నులు సన్నర కం దిగుబడులు వస్తాయని ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో కొంతవరకు స్థానిక అవసరాలకు పోను 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వ స్తుందని అంచనా వేశారు.
అందుకు అనుగుణంగా 330 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 189 కేంద్రాల్లోనే కొనుగోళ్లను చేపడుతున్నారు. వీటిలో 97 ఐకేపీ సెంటర్లు, 88 పీఏసీఎస్, 4 జీసీసీ కేంద్రాలు ఉన్నాయి. ఈ యాసంగి ధా న్యం సేకరణ లక్ష్యం 1,62,414 మెట్రిక్ టన్నులు కా గా, ఇప్పటివరకు కేవలం 52,072 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం 40,884 మెట్రిక్ టన్నులు, సన్నరకం 11,118 మెట్రిక్ టన్నులుగా ఉన్నది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.120 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.19 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంటే ఇంకా దాదాపు రూ.100 కోట్ల వరకు చెల్లించాలి.
పేరుకుపోయిన వడ్ల కుప్పలు
యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతోపాటు ఎటూ చూసినా వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పది రోజులుగా రోజు జిల్లాలో ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం తెల్లవారుజామున నిర్మల్ మండలం కౌట్ల(కే), తాంశ, ముజ్గి గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు వడ్ల కుప్పలపై టార్ఫాలిన్లను కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు.
20 రోజులుగా ఇక్కడి సెంటర్‌కు వడ్లను తీసుకొచ్చామని, ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని తాంశ గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ధాన్యం తేమ శాతం వచ్చినప్పటికీ ఎప్పుడు కొంటారోనని ఎదురుచూస్తూ రోజుల తరబడి వడ్ల కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అకాల ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం తాంశ గ్రామంలో వర్షం కురియడంతో ఆందోళన చెందిన రైతులంతా కలిసి కేంద్రం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. వడ్లను కొంటరా? కొనరా? అంటూ నిలదీశారు. హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లు చేపట్టలేకపోతున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
కనీసం గన్నీ బ్యాగులైనా ఇస్తే తామే వడ్లను నింపుకుంటామని కొందరు రైతులు మొర పెట్టుకున్నా కేంద్రాల నిర్వాహకులు బ్యాగులు ఇవ్వడం లేదు. మరోవైపు వడ్లను తరలించేందుకు లారీల కొరత ఉన్న కారణంగా కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇలా అనేక రకరకాల కొర్రీలతో కొనుగోలు ప్రక్రియ మందకోడిగా సాగుతున్నది. గత కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు మండిపడుతున్నారు.
అధికారులు స్పందించాలి..
కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత ఉన్నది. తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. ఇక్కడి సెంటర్‌కు 20 రోజుల క్రితం వడ్లు తీసుకొచ్చిన. తేమశాతం వచ్చినా తూకం వేయకపోవడంతో రోజుల తరబడి కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నం. ఇప్పటికైనా అధికారులు స్పందించి హమాలీల కొరత తీర్చాలి. వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నయంటున్నరు. కష్టపడి పండించిన ధాన్యం వర్షం పాలు కాకముందే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
– వీ మహేశ్‌రెడ్డి, రైతు, తాంశ
కేసీఆర్ ఉన్నప్పుడే బాధ లేకుండే..
నాకు సొంతంగా రెండెకరాల పొలం ఉన్నది. ఇతరులది ఐదెకరాలు కౌలుకు చేసిన. 7 ఎకరాల్లో వడ్లు పండించిన. ఏడు ట్రాక్టర్ల దాకా పంట దిగుబడి వచ్చింది. అమ్ముకుందామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. వారం రోజులైంది. ఎవరూ పట్టించుకునెటోళ్లే లేరు. ఎప్పుడు కొంటరో తెల్వదు. కుప్పలు పోసి కవర్లు కప్పి పెట్టిన. రోజు రాత్రి కావలికి వస్తు న్న. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏ బాధ లేకుండే. అన్ని మంచిగ చేసిండు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రైతులకు అన్నీ కష్టాలే..
– అశోక్, కౌలు రైతు, తాంశ