మంచిర్యాలటౌన్, మే 14 : రామకృష్ణాపూర్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గడిగొప్పుల సదానందం (46) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మంచిర్యాలలోని గోపాల్వాడలోగల విద్యానగర్ కాలనీలో నివసించే సదానందం బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం మల్కేపల్లిలో పీవోగా విధులు నిర్వహించి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు.
మంగళవారం ఉదయం యథావిధిగా మైదానానికి వెళ్లిన ఆయన ఇంటికి వచ్చిన అనంతరం గుడికి వెళ్లాడు. అప్పటికే కాస్త అలసటగా ఉండగా, తన రెండో కూతురుతో కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో దవాఖానకు రెఫర్ చేశారు. ఐబీ ప్రాంతంలోని మరో ఆస్పత్రికి వెళ్లగా,, అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు.
సదానందంకు భార్య సంధ్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతరుకు రెండు నెలల క్రతమే వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంది. పెద్దకూతురు వచ్చిన తర్వాత గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలిపారు. కాగా, సదానందం మృతిపట్ల పీడీలు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన హఠాన్మరణం చెందడం పలువురిని కంటతడిపెట్టించింది.