కన్నెపల్లి, ఫిబ్రవరి 9 : కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదట శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని దారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమీపంలో నిర్మించడానికి ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారన్నారు.
కానీ, ఆ స్థలంలో కాకుండా సబ్స్టేషన్ సమీపంలో నిర్మాణం చేపడుతున్నారని, కనీసం నీరు కూడా దొరకని చోట దవాఖాన నిర్మించడమేమిటని వారు మండిపడ్డారు. అక్కడ నిర్మిస్తే ప్రజలు, రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, మొదట అనుకున్న స్థలంలోనే దవాఖాన నిర్మించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవి, గణేశ్, బీజేపీ నాయకులు పుల్లూరి రాజయ్య, ఆటో యూనియన్ నాయకుడు అంజయ్య పాల్గొన్నారు.