ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 131 వినతులను అందించారు. అలాగే నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో కూడా కలెక్టర్ అభిలాష అభినవ్ దరఖాస్తులు తీసుకున్నారు. 98 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు.
కల్తీకల్లు తాగి చనిపోతున్నారు
తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామస్తులు కల్తీ కల్లుతాగి అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ కల్లు విక్రయాలను నిరోధించాలని గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లు లేవని, చెట్ల నుంచి కల్లు వచ్చే అవకాశాలు లేవన్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో విచ్చలవిడిగా కల్తీకల్లును తయారు చేసి విక్రయిస్తున్నట్లు యువకులు తెలిపారు. కల్తీ కల్లు తాగి ఇప్పటికే ఇద్దరు మరణించారని, విధులు ముగించుకుని వస్తున్న ఆర్టీసీ బస్ కండక్టర్ భీంరావు కల్లుతాగి వాహనం నడిపిన వ్యక్తి ఢీ కొనగా ఆయన కాళ్లు, చేతులు విరిగి మంచంపట్టినట్లు తెలిపారు. విక్రయాలు ఆగకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబరు 45, భుక్తాపూర్‌లో గల నక్షత్ర ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆసుపత్రికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది, పేషెంట్లను తీసుకొచ్చిన వారు రోడ్డుపై వాహనాలను పెడుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్నారు. దీంతో తమ రోజువారి పనులకు ఆటంకం కలుగుతున్నట్లు తెలిపారు. జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్ల శబ్దాలతో చిన్నారులు, మహిళలు భయందోళనకు గురువుతున్నారన్నారు. ఆసుపత్రిపై గతంలో వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చిన చర్యలు తీసుకోలేదని తెలిపారు.
50 సార్లు తిరిగినా పరిష్కారం కాలే..
50 సార్లు కార్యాలయాల చు ట్టూ తిరిగినా భూ సమస్య పరిష్కారం కాలేదని నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని మాడేగాంకు చెందిన రైతు షాతూరు తుకారాం ఆందోళన చేశారు. తన తాత పేరిట ఉన్న భూమిని తనకు పట్టా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమి ఆక్రమణకు గురవుతుందని పలుమార్లు అధికారులకు గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదని, లంచాలు ఇవ్వందే పనికావడం లేదని రైతు మండిపడ్డాడు. తన భూ సమస్య పరిష్కరించాలని, ఉండడానికి స్థలం కూడా లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
పొలాలకు సాగు నీరందించాలి..
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్‌లో అంబవాయి చెరువు కింద పొలాలు ఉన్నాయని, గత మూడేళ్లుగా సాగు నీరందడం లేదని రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలువ సరిగ్గా లేకపోవడంతో నీరందడం లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. త్వరగా కాలువ పనులు పూర్తి చేసి, పొలాలకు సాగు నీరందించాలని కోరారు.
గెస్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలి..
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గతేడాది పనిచేసిన 65 మంది గెస్ట్ లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా.. తమ నియామకం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తరగతులు జరగక విద్యార్థులు నష్టపోతున్నట్లు తెలిపారు. ఐదేండ్లుగా వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్టరర్లను ఆటో రెన్యూవల్ చేయాలని త్రీ మాన్ కమిటీ డెమో విధానాన్ని రద్దు చేయాలన్నారు. గతేడాదికి సంబంధించిన 12 నెలల వేతనాన్ని మంజూరు చేయాలని కోరారు.
ప్రభుత్వ భూములను రక్షించాలని వినతి
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని విక్రయిస్తున్నారని గ్రామాభివృద్ధి సంఘం సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 1969లో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ముంపునకు గురి కాగా.. ముక్టాపూర్ శివారులోని ప్రాంతంలో పునరావాసం కల్పించి గ్రామం ఏర్పాటు చేశారు. అప్పుడు గ్రామ అవసరాలు, పశువులను మేపడానికి అధికారులు కొంత మిగులు భూమిని వదిలివేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొందరు అక్రమంగా నకిలీ పట్టాలు సృష్టించి, విక్రయిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
రోడ్డు సౌకర్యం కల్పించండి
భీంపూర్ మండలంలోని గుబిడిపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు కలెక్టర్‌ను కలిసి దరఖాస్తు అందజేశారు. గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయని.. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్న తాము రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా రహదారి బురదమయంగా మారిందని, నడవలేని దుస్థితి ఉందన్నారు. రహదారి లేకపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగడంతోపాటు అనారోగ్యానికి గురైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు.