మంచిర్యాలటౌన్/చెన్నూర్/లక్షెట్టిపేట/మందమర్రి/ దండేపల్లి/హాజీపూర్/కోటపల్లి/జన్నారం, డిసెంబర్ 4: మంచిర్యాల జిల్లాలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, హాజీపూర్, జైపూర్, కోటపల్లి, దండేపల్లి, జన్నారం తదితర మండలాల్లో ఉదయం 7:25 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. ఇండ్లలో ఉన్న వంట పాత్రలు, కిటికీలు, కుర్చీలు, తదితర సామగ్రి కదలడాన్ని గమనించిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సింగరేణి పరిసర ప్రాంతాల వారు ఓసీపీలో బ్లాస్టింగ్లతో ప్రకంపనలు వచ్చి ఉంటాయని మొదట భావించారు. ఆ తర్వాత భూకంపమని తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు. భూప్రకంపనలు దృశ్యాలు పలువురి ఇండ్లల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొన్ని సేకండ్లకే భూప్రకంపనలు ఆగిపోవడం, ఎలాంటి నష్టం జరగక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.