ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్, జూన్ 29 ః మా సమస్యలు వినండని సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రాలు అందించారు. నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి..
ఎస్సీడీడీ పరిధిలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఔట్సోర్సింగ్ యాక్టివిటి విధానంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సునారికారి రాజేశ్ మాట్లాడుతూ.. పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో వర్క్ చేస్తున్న వంట కార్మికులు, స్లీపింగ్ నైట్ వాచ్‌మన్ శానిటేషన్ వర్కర్లకు 14 నెలలుగా వేతనాలు లేక తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, నాయకులు గిల్లి రాకేష్, హెచ్. సునిల్, లలిత, శాంత, బి.లక్ష్మి, రాజవ్వ, రాధ, వరలక్ష్మి, సంధ్య, సంతోషి, నయనతార పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో వసతులు కల్పించాలి..
బెస్ట్ అవైలబుల్ కింద ఎంపికైన వశిష్ట పాఠశాలలో వసతులు కల్పించడంతోపాటు ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా అందించే నోటు పుస్తకాలు, యూనిఫాం, షూస్ ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో గల సోనాపూర్ గ్రామపంచాయతీ ఆర్కాయితండాకు చెందిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 40 ఏళ్లుగా అటవీ భూములలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోగా ఇండ్లు మంజూరైనా అటవీ అధికారులు ఇండ్లు కట్టుకోకుండా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలి..
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బాది పంచాయతీ పరిధిలో ఉన్న హేటి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గ్రామంలో 85 కుటుంబాలు ఉండగా సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షాకాలంలో బురదతో రెండు కిలోమీటర్లు నడువలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. రోడ్డు సరిగా లేకపోవడంతో వ్యవసాయ పనులు కూడా చేసుకోలేకపోతున్నామని, అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని కోరారు.
మ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించండి..
బెస్ట్ అవైలబుట్ పథకంలో భాగంగా ఎంపికైన పాఠశాలలను యాజమాన్యం మూసివేసింది. ఇందులో చదువుకుంటున్న మా పిల్లలు చదువుకోలేని దుస్థితి నెలకొన్నది. అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న 120 మంది పిల్లలు, పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే ఇతర పాఠశాలలకు పంపిస్తామంటున్నారు. కానీ.. పక్షం రోజులుగా ఏ బడికి పంపడం లేదని తెలిపారు. కలెక్టర్ స్పందించి పిల్లలను ఇతర స్కూళ్లల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.