నమస్తే బృందం : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజలు దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పటాకులు కాల్చారు. శుక్రవారం ఇళ్లలో కేదారేశ్వర స్వామికి నోములు, వ్రతాలు ఆచరించారు. బంధువులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టారు. మంచిర్యాలలో గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు.. ఆయన తనయుడు, బీఆర్ఎస్ యూత్ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు వ్యాపారులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన నివాసంలో కుటుంబ సమేతంగా పటాకులు కాల్చారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వినోద్ పూజలు చేశారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది దీపాలు వెలిగించి, స్వచ్ఛ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. గిరిజన గూడేల్లో నిర్వహించి దండారీ వేడుకలు ఆకట్టుకున్నాయి. సిర్పూర్(యు) మండలం పిట్టగూడ గ్రామంలో నిర్వహించిన గుస్సాడీ సంబురాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడి పాడారు. సహపంక్తి భోజనం చేశారు.