ఆదిలాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఆదిలాబాద్ టౌన్, ఆదిలాబాద్ రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రైతు భరోసాతో పాటు ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేసినా ఆయన స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. జైనథ్ మండలం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి పిడుగు స్వామి యాదవ్ బీఆర్ఎస్లో చేరగా మాజీ మంత్రి జోగు రామన్న గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, విజ్జిగిరి నారాయణ, అలాల అజయ్, యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, రాజన్న, గండ్రత్ రమేశ్, సెవ్వ జగదీశ్, కుమ్ర రాజు, దయాకర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.