కుభీర్ : ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను( Promises) చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Rama Rao Patel ) ఆరోపించారు. కుబీర్లోని రైతు వేదికలో బుధవారం 101 మంది కల్యాణలక్ష్మి ( Kalyanalaxmi ) , షాదీ ముబారక్( Shadimubarak ) లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించి ఆడపడుచులకు అండగా ఉంటామని మాయమాటలు చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు లీటర్కు రూ. 5 నుంచి రూ. 6లు చొప్పున తక్కువ ఉందని తెలంగాణ ఎక్కువగా అమ్ముతుండడాన్ని తప్పుపట్టారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీలతోపాటు పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ సుంకం తగ్గించే విధంగా,కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అందేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోగా రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మండలంలోని ఐదు గిరిజన తండాలకు ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.
టెండర్ ప్రక్రియ కూడా త్వరలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద, బాసర మాజీ జడ్పీటీసీ సౌన్లీ రమేష్, నాయకులు ఏషాల దత్తాత్రి, శేఖర్, రాథోడ్ శంకర్, తహసీల్దార్శివరాజ్, పండిత్ జాదవ్, లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు.