నిర్మల్, జూన్ 14(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు పింఛన్ పెంచుతామని ఇచ్చిన హామీ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముం దు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలకు ఇచ్చే రూ.2016 పింఛన్‌ను రూ. 4వేలు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ.4016 నుంచి రూ.6వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన పింఛన్‌దారులు పింఛన్ల పెంపు ఎప్పుడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రచారం చేస్తున్నా.. ప్రతి పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెట్టి అర్హులను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగిస్తుండడంతో పేదలకు సక్రమంగా పథకాల ఫలాలు అందడం లేదు.
అలాగే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా పాత పింఛన్లే ఇస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా లబ్ధిదారులు తమకు కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా అందించే పింఛన్ డబ్బుల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెల మొదటి వారంలో ఠంఛన్‌గా పింఛన్ డబ్బులు అందగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మరో 20 రోజులు ఆలస్యంగా డబ్బులను పంపిణీ చేస్తున్నది. ఒక్కోసారి నెల దాటినా అందడం లేదు.
ఆసరా పింఛన్లతోనే బతుకుతున్న వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తున్నది. చాలా మంది లబ్ధిదారులకు గత ఏప్రిల్ నెల పింఛన్ డబ్బులు నేటికీ అందలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు పొందుతున్న వారు 1,51,362 మంది ఉండగా.. వీరికి ప్రతి నెల రూ.31.58 కోట్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 37,666, వితంతు 37,781, దివ్యాంగ 10,650 మందికి అందుతున్నాయి. అలాగే గీత కార్మికులు 293, చేనేత 53, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు 232, డయాలసిస్ రోగులు 58, ఒంటరి మహిళలు 2148, బీడీ కార్మికులు 62,481 మందికి పింఛన్లు అందుతున్నాయి.
మూడేళ్ల కింద చెట్టుపై నుంచి జారి పడడంతో కుడి కాలి పాదం దెబ్బతి న్నది. దీంతో నడవడం ఇబ్బందిగా మారింది. 2022లో నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన సదరం క్యాంపులో డాక్టర్లు పరీక్షించి వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత దివ్యాంగ పింఛన్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. ఆఫీసర్ల దగ్గరికి ఎన్ని సార్లు పోయి అడిగాన.. ఇంకా గవర్నమెంటు నుంచి కొత్త పింఛన్లు రాలేదని అంటున్నరు. ఈ కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదంటున్నరు. నా కాలు మంచిగున్నప్పుడు 8 బర్లతో గ్రామంలోనే డైరీఫాం నిర్వహిస్తూ పాలను సేకరించి నిర్మల్‌కు తీసుకెళ్లి అమ్మేవాన్ని. ఇప్పుడు నడవడానికి ఇబ్బంది ఉండడంతో ఉన్న బర్లను అమ్మేసిన. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – రమేశ్‌రెడ్డి, దివ్యాంగుడు, తాంశ.
కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక రూ.4 వేల పింఛన్ ఇస్తమని అన్నరు. అచ్చి దగ్గర దగ్గర రెండేండ్లకు అస్తున్నది. రూపాయి కూడా పెంచలే. ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేల పింఛనే అస్తున్నది. పింఛన్ పెంచుతామని చెప్పి పెంచకుండా కాంగ్రెసోళ్లు మాట తప్పుతున్నరు. నా ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో చనిపోయిన్రు. నాకు ఏ ఆధారం లేదు. పింఛనే ఆధారం. కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ ఏ నెలకు ఆ నెల టైంకు అస్తుండే. ఇప్పుడు అచ్చేదాక గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినకాడి సంది పింఛన్ పెంచడం గురించి ఒక్క మాట కూడా లేదు. మా ముసలోళ్లంటే ఇంత అలుసుతనమా. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎలచ్చన్ల గెలిసిండ్రు. ఇప్పటికైనా పింఛను పెంచి రూ.4 వేలు ఎప్పుడిస్తరో చెప్పాలి. లేకుంటే సర్పంచ్ ఎలచ్చన్ల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతం.
– కట్ట చిన్నమ్మ, వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు, ముజ్గి, నిర్మల్ మండలం.