మంచిర్యాల, జూన్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితం నేడు వెలువడనున్నది. ఈ మేరకు యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లను హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్ కాలేజీలో, పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను రామగుండం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్కించనున్నారు. 2019లో మొత్తం ఏడు నియోజకవర్గాల ఓట్లను సెంటినరీ జేఎన్టీయూహెచ్ కాలేజీలోనే లెక్కించారు. ఆ సమయంలో ఫలితం వెలువడడంలో కొంత ఆలస్యమైంది. ఈసారి అలాంటి ఇబ్బందుల్లేకుండా సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ ముగిసిన రోజే స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ట బం దోబస్తు ఏర్పాటు చేశారు. పైగా నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ వస్తున్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాసులు ఎప్పటికప్పుడు ఈవీఎంలు భ ద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ మొద లు కానున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకమైన హాల్ చొప్పున మొత్తం మూడు గదులు కేటాయించారు.
అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షం లో ఒక్కో టేబుల్ దగ్గర గెజిటెడ్ హోదా అధికారి పర్యవేక్షణలో గణిత ఉపాధ్యాయుడు సహాయకుడిగా.. కేంద్ర ప్రభు త్వ ఉద్యోగి అబ్జర్వర్‌గా ఉంటారు. ముందుగా ఈవీఎంలను తెరచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లాటరీ పద్ధతిలో ఐదు చొప్పున పోలింగ్ కేంద్రాల స్లిప్పులను లెక్కిస్తారు. అనంతరం వాటిని కంట్రెల్ యూనిట్లో పోలైన ఓట్లతో సరిపోలుస్తారు. అనంతరం టేబుళ్ల వారీగా ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. కౌటింగ్ కోసం శిక్షణ తీసుకున్న అధికారులు, సిబ్బంది సోమవారమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలోకి ఎవరూ రాకుండా నియంత్రిస్తున్నారు. ఈ మేరకు 24 గంటలపా టు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మద్యం విక్రయాలు సైతం నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి 136 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన మధ్యాహ్నానికి తుది ఫలితం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.