ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతులు యాసంగిలో శనగ సాగు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,01,080, నిర్మల్‌లో 56,000 కలిపి 1,57,080 ఎకరాల్లో పంట వేశారు. రెండు జిల్లాల్లో కలిపి 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.5,335 ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు రూ.4,700 చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాలుకు రూ.635 నష్టపోవాల్సి వస్తున్నది.
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 16 కేంద్రాలు ఏర్పాటు చేసి శనగలు సేకరించనున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని కుభీర్, మాటేగాం, మథోల్లలో కొనుగోళ్లు జరుగుతుండగా.. మరో మూడింటిని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 27వ తేదీ నుంచి పది కేంద్రాల్లో కొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు సేకరించాలని, అలాగే మద్దతు ధర కూడా చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ)ఇచ్చోడ
శనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతుబంధు మండలాధ్యక్షుడు బత్తుల అశోక్, సిరికొండ సంపదల సొసైటీ చైర్మన్ గోర్బంట్ ప్రకాశ్, సిరికొండ సరి సంపదల సొసైటీ సిబ్బందితో కలిసి శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌ను కలిశారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో కలిసి శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మార్క్‌ఫెడ్ డీఎంకు లెటర్ అందజేశారు. త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీవో సచిత్, సీఈవో సునీల్ పాల్గొన్నారు.